calender_icon.png 28 October, 2024 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 ఏండ్ల కనిష్ఠానికి ఎన్‌పీఏలు

28-06-2024 12:58:01 AM

  • 2.8 శాతానికి తగ్గిన బ్యాంక్‌ల మొండి బకాయిలు
  • రిజర్వ్‌బ్యాంక్ ఆర్థిక స్థిరత్వ నివేదిక

ముంబై, జూన్ 27: దేశంలో బ్యాంకుల మొండి బకాయిలు 12 ఏండ్ల కనిష్ఠానికి తగ్గాయని రిజర్వ్‌బ్యాంక్ గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో వెల్లడించింది. జీడీపీ వృద్ధి జోరు, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలను తట్టుకోవడం ఎన్‌పీఏల (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్/నిరర్థక ఆస్తులు) తగ్గుదలకు దోహదపడిందని ఆర్బీఐ పేర్కొంది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌ల స్థూల ఎన్‌పీఏలు 2024 మార్చి చివరినాటికి 2.8 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.6 శాతానికి తగ్గినట్టు తెలిపింది. వచ్చే 2025 మార్చినాటికి బ్యాంక్‌ల స్థూల ఎన్‌పీఏలు 2.5 శాతానికి మెరుగుపడతాయని ఆర్బీఐ నివేదికలో అంచనా వేసింది. 

సానుకూల అంశాలు

బ్యాంక్‌ల మొండి బకాయిలు మరింత తగ్గుదలకు పలు సానుకూల అంశాలు ఉన్నాయని ఆర్థిక స్థిరత్వ నివేదిక పేర్కొంది. పటిష్ఠ ఆర్థికాభివృద్ధి, దేశీయంగా వినియోగ డిమాండ్ జోరు, గరిష్ఠస్థాయిలో ఉన్న వ్యాపార విశ్వాసం, మూలధన వ్యయంపై ప్రభుత్వం దృష్టి కొనసాగింపు తదితర అంశాలు బ్యాంక్‌ల ఎన్‌పీఏలను తగ్గిస్తాయన్నది. కార్పొరేట్లు సంపాదిస్తున్న అధిక లాభాలను తిరిగి పెట్టుబడి చేయడం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం సైతం మొండి బకాయిల్ని తగ్గుదల బాటలో ఉంచుతాయన్నది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ల మెరుగుదలతో రుణ వృద్ధి విస్త్రతంకావడం మరో పెద్ద సానుకూల అంశమని ఆర్బీఐ తెలిపింది.

రిస్క్‌లూ ఉన్నాయ్

బ్యాంక్‌ల ఎన్‌పీఏలు తమ అంచనాలకు తగినరీతిలో తగ్గకపోవడానికి రిస్క్‌లు కూడా ఉన్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాటివల్ల సరఫరా పరిస్థితులు దెబ్బతినడం, కమోడిటీ ధరల పెరుగుదల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందకొడితనం, అనిశ్చిత వాతావరణ పరిస్థితులు వంటి అంశాలు తిరిగి బ్యాంక్‌ల మొండి బకాయిల్ని పెంచుతాయన్నది.