calender_icon.png 27 October, 2024 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటలు ఆడుకుందామా!

11-05-2024 12:05:00 AM

ఆటలు పిల్లల దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ఆటలు ఆరోగ్యానికే కాదు పిల్లలకు వినోదం అందించడంలోనూ, బుద్ధి వికాసం కలిగించడంలోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడుతాయి. బడిలో ఆటల వల్ల పిల్లల్లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందుతాయి. ప్రస్తుత కాలంలో పిల్లలు ఎలక్ట్రానిక్ ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎలాంటి వ్యాయామాలు చేయడం లేదు. దానితో వారు కొంత మందకొడిగా తయారవుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లకు దూరంగా ఉంచడంతో పాటు ఆటల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలియజేయండి.

పిల్లల మానసిక ఎదుగుదలకు, వికాసానికి విద్య ఎంత అవసరమో, శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి ఆటల ద్వారా లభించే వ్యాయామమూ అంతే అవసరం. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడలాడటం లేదు. ట్యూషన్‌కు వెళ్లడం లేదా హోం వర్కులు చేయడం, తర్వాత టీవీ, కంప్యూటర్ ఆటలతో గడపడం సరిపోతుంది. దీంతో వారి శరీరానికి సరైన వ్యాయామం ఉండటం లేదు. ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు. ఆటల వల్ల చురుకుదనం, శారీరక, జ్ఞాపకశక్తి, దారుఢ్యంద, ఏకాగ్రత కూడా పెంపొందుతాయి. నీరెండలో ఆడటం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా లభిస్తుంది. పిల్లల్లో ఆశావహదృక్పథం అలవడుతుంది. శారీరకంగా బలంగా ఉన్న పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడులో ప్రతిస్పందనల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆటలు జీర్ణశక్తి పెంచుతాయి. మనసు ఆహ్లాదంగా ఉంటుంది.

ఆటలు ఆడుకోవడం వల్ల శరీరంలో కోపతాపాల్లాంటి ఉద్వేగాలు బయటకు వెళ్లిపో తాయి. ఆటల వల్ల పిల్లల్లో పరిచయాలు పెరుగుతాయి. ప్రవర్తనలో సర్దుబాటుతత్తం అలవడుతుంది. జయాపజయాలకు అలవాటు పడతాయి. అప్పుడప్పుడూ పెద్దలు కూడా పిల్లలతో కలిసి ఆడటం వల్ల పిల్లలకు, పెద్దలు మరింత దగ్గరవుతారు. వారి మధ్య అనుబంధం చాలా ఆరోగ్యకరంగా ఉంటుం ది. ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచినవారిని ప్రోత్సహించాలి. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఆటల ద్వారా చైతన్యవంతం చేస్తే వారు క్రమశిక్షణగల పౌరులుగా ఎదుగుతారనడంలో ఏమాత్తం సందేహం లేదు.

ఆటల్ని అటకెక్కించిన స్మార్ట్ ఫోన్

పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తే డ్రగ్స్ ఇచ్చినట్టే అంటున్నారు నిపుణులు. స్మార్ట్ ఫోన్‌లు తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. పిల్లలని మొబైల్ నుంచి దూరంగా ఉంచడానికి నానాయాతనలు పడుతున్నారు తల్లి దండ్రులు. శారీరక, మానసిక ఎదుగుదలకు మొబైల్ ఫోన్లు అడ్డంకిగా మారుతున్నాయి అంటున్నారు మానసిక నిపుణులు. చాలామంది పిల్లలో చాక్లెట్ల వ్యసనం కంటే స్మార్ట్‌ఫోన్‌ల వ్యసనమే ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంట్లో చిన్నారులు ఏడుపు మొదలెడితే స్మార్ట్‌ఫోన్ వీడి యోలు పెట్టి బుజ్జగిస్తున్నారు. ‘అమ్మానాన్న లూ.. మాకు ప్రేమను పంచండి... మేం పిలిస్తే పలకండి... మీ ఫోన్లు దూరం పెట్టండి’ అంటూ ఇటీవల ఓ మెట్రో నగరంలో ఏడేళ్ల బాలుడు వీధుల్లోకి వచ్చి ‘ప్లకార్డు’ ప్రదర్శించాడంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల ఆత్మీయతకు పిల్లలెంత దూరమవుతున్నారో అర్ధమవుతుంది.

ఇంట్లో ఇంటర్నెట్ సౌలభ్యం ఉందంటే కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రపంచాన్ని చూడ్డం, చుట్టేయడమే. పిల్లలు ఇంటర్నెట్‌లో ‘సెర్చిం గ్’ బాగా ఇష్టపడతారు. దీన్నే అలుసుగా తీసుకుని, కౌమరదశలో ఉన్న పిల్లలు చెడు మార్గాల వైపు వెతుకులాట మొదలు పెడుతున్నారు.ఇంటర్నెట్‌లో విభిన్న సైట్స్‌ను చూడ్డం వల్ల, ఒక్కోసారి వారికి తెలియకుండానే కొత్త కొత్త సైట్స్ వచ్చేస్తుంటాయి. కొన్ని ప్రకటనల వల్ల పిల్లలు వారికి తెలియకుండానే రహస్యమైన ప్రపంచానికి ఆకర్షితులవుతున్నారు.

పిల్లలపై అటు స్కూల్లో ఒత్తిడి, ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు పిల్లల కోసం సమయాన్ని కేటాయించే అవకాశం లేని కారణంగా ప్లేగ్రౌండ్‌లో ఆడాల్సిన ఆటలు మొబైల్‌లో ఆడుకుంటున్నారు వాటి నుంచి కూడా ఒత్తిడికి గురి అవుతున్నారు.

గెలుపు అందరి సొంతం కాదు అది శ్రమ పై ఆధారపడి ఉంటుంది. ఆటలు పిల్లలకైనా, పెద్దలకైనా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఓర్పు, సహనం, ఏకాగ్రత, పట్టు దల, ఆత్మవిశ్వాసం, నిలకడ, జీవితంపై పాజిటివ్ దృక్పథం, సాధించాలనే తపన, మానసి క స్థుర్యైం ఇవన్నీ ఆటల నుంచి లభిస్తాయి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఆటలను ఆడుతున్నారా? ఎందుకు ఆడటం లేదు గంటల తరబడి ఆడుతున్నారు. కాకపోతే ఆన్‌లైన్ ఆటలే వ్యసనంగా ఆడుతున్నారు. ఆన్ లైన్ గేమ్స్‌కు పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. అవిలేకుంటే జీవితం లేదనే భావనలోకి వెళ్లి పోతున్నారు.

‘ది టైమ్స్’ పత్రిక జరిపిన సర్వేలో పాఠశాలల్లో జరుగుతున్న దిగ్భ్రాంతిని కలిగించే విషయాలను బహిర్గతం చేసింది. విద్యార్థుల నుంచి తమకు ఎదురవుతున్న ఆన్‌లైన్ వేధింపుల విషయంలో టీచర్లకు ఎటువంటి సహకారమూ లభించడం లేదు. మరోపక్క తరగతి గదులలో విద్యార్థుల ఆన్‌లైన్ కార్యకలాపాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుం ది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు టీచర్లని వేధించడం ఓ సరదాగా తీసుకుంటున్నారు. పిల్లల్లో ఈ ధోరణిని అరికట్టాలి. ఆన్ లైన్ వేధింపులకు గురికావడంవల్ల టీచర్లు ఎన్నో రకాలుగా మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. అది వారి భవిష్యత్తునూ, జీవితాలనూ కూడా నాశనం చేస్తుంది. 

పిల్లలు నలుగురితో కలిసిపోవాలంటే, ఇతరులతో పోల్చడం మానేయాలి. చిన్నారుల్లో భావోద్వేగాలు, ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఇతరులతో పోల్చడం, వెక్కిరింపులకు గురిచేయడం, పేర్లు పెట్టడం, నలు గురిలోనూ చులకన చేసి మాట్లాడటం.. తద్వారా వారు మరింత కుంగిపోయే ప్రమా దం ఉంది. అందుకే వారిని ఇతరులతో పోల్చి ఒత్తిడికి గురి చేయకూడదు. వారిలో దాగివున్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసేందుకు ప్రయత్నించాలి. ప్రోత్సహించాలి. ఇలా తల్లిదండ్రులు అందించే నైతిక మద్దతు వారిని విజయతీరాలకు చేర్చుతుంది. 

బెర్నాడోస్ చిల్డ్రన్స్ ఛారిటీ అన్నది 1866లో ఇంగ్లాండులో స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సంస్థ. ‘ప్రాథమిక విద్య స్థాయిలో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ల వ్యవహారం చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. వాస్త వ ప్రపంచంలో ఆరోగ్యకరమైన మానవ సంబంధాల ఆవశ్యకతను గురించి ఆ వయసు పిల్లల నుంచి చక్కటి అవగాహన కలిగించేందుకు మనం కృషి చేయాలి. లేకపోతే ఇంటర్నెట్ వైపరీత్యాలకు రాబోయే తరం బలయ్యే ప్రమాదం ఉంది’ అని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జావేద్ ఖాన్ హెచ్చరిస్తున్నారు.

బ్లూవేల్ ఛాలెంజ్, పోకేమాన్ గో, పబ్ జీ ఇవన్నీ పేరుకు ఆన్‌లైన్ గేమ్స్. కాని మనుషుల ప్రాణాలు తీస్తున్న గేమ్స్ అని గ్రహించలేకపోతున్నారు. తను బతకాలంటే ఇతరులు చావాలనే సిద్ధాంతమే అత్యంత ప్రమాదకరమైనది. ఆటలో గెలవలేదని ఒత్తిడికి గురి అవుతున్నారు. అనుబంధాలను విస్మరిస్తున్నారు. హత్యలు కూడా జరుగుతున్నాయంటే ఆటలు ఏ విధంగా అడిక్ట్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ క్రీడల్లో 60 శాతం యువత నిత్యం గేమ్‌లలో మునిగిపోతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఈ గేమ్ ఆడే పిల్లలు లేదా పెద్దల ప్రవర్తనలో మార్పులు రావడం, వారిలో హింసా ప్రవృత్తి పెరుగుతుండటంతో పాటు విద్యార్థుల చదువు కూడా నాశనం అవుతుండటంతో చాలా ప్రభుత్వాలు పబ్‌జీ లాంటి ఇతర గేమ్‌లను ఆడవద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.

మనకు అవసరం లేని సైట్స్‌ను బ్లాక్ చేయడానికి మార్కెట్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నా యి. నెట్‌గేర్ రౌటర్‌లో పేరెంటల్ కంట్రోల్ లాక్ వంటి చాలా సాప్ట్‌వేర్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లు యాంటీ వైరస్‌లా పని చేస్తాయి. అలాంటి సాఫ్ట్‌వేర్‌లను పోర్న్‌సైట్స్‌ను బ్లాక్ చేసేందుకు ఉపయోగిస్తారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేశారన్న విషయం తెలియకుండా చేస్తుంది ఈ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ కేవలం సైట్‌ను బ్లాక్ చేయడమే కాదు, ఇంటర్నెట్‌లో ఏం చూశారు? ఏం చేశారు అన్న విషయాలన్నింటినీ సేవ్ చేసి పెడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఎవరెవరితో ఏమేం ఛాట్ చేశారో కూడా చూపిస్తుంది. ఎంతసేపు కంప్యూటర్ ను ఉపయోగించాం అనే విషయాలను కనిపెట్టడమే కాకుండా, వాట న్నింటిని సేవ్ చేస్తుంది.