తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకుంది సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్. ఇటీవల హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. చిరంజీవితో కలిసి మళ్లీ నటించాలని ఉందని తెలిపింది. ఇంకా పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన రోజుల్నీ గుర్తు చేసుకుంటూనే, ఆయన గురించి అభిప్రాయాన్ని వివరించింది. ‘ఇటీవలి ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాన్నందుకున్నారు.
ఆ విషయంలో నాకెంతో గర్వంగా ఉంది. శ్రమపడే మనస్తత్వం ఆయనది. ప్రజలకు మంచి చేయాలని తపిస్తుంటారు. ప్రజలు ఆయన్ను డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్లటం సంతోషంగా ఉంది. ఆయన అద్భుతాలు సృష్టిస్తారన్న నమ్మకం నాకుంది. మేమిద్దరం గతంలో ‘బాలు’ సినిమా కోసం కలిసి పనిచేశాం. ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు. ఆ సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ టైంలో ఆయన కాలికి గాయమైంది. పాట షూట్ పూర్తయ్యేదాకా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు’ అని పవర్ స్టార్‌పై ప్రశంసలు కురిపించింది.
ఇంకా తన కెరీర్ గురించి చెప్తూ.. “ప్రస్తుతం నేను ‘షో టైమ్’ అనే ప్రోగ్రామ్ కోసం పనిచేస్తున్నా. బాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశాలొస్తున్నాయి. తెలుగులో తేజ సజ్జా మూవీలో నటిస్తున్నాను. సినిమాలకు ఇప్పుడు భాషతో సంబంధం లేదు.. కంటెంట్ బాగుంటే చాలు, ప్రేక్షకులు చూసేస్తున్నారు. ‘టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఏ ఇండస్ట్రీ అంటే ఇష్టం?’ అన్న ఓ ప్రశ్నకు సమాధానంగా ‘ఇండియన్ సినిమా అని చెప్పటం నాకిష్టం’ అని తెలిపింది.