calender_icon.png 7 January, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక గ్రీన్‌ఎనర్జీ బాట

06-01-2025 01:12:01 AM

‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025’ ప్రకటించిన ప్రభుత్వం

  1. వచ్చే పదేళ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు
  2. 1.14 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి
  3. భారీగా రాయితీలు.. ప్రోత్సాహకాలు
  4. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు భరోసా
  5. ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల అదనపు ఉత్పత్తి

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ రంగం సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోం ది. రాబోయే పదేళ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.14 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనతోపాటు 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025’ని రూపొందించింది.

ఈ కొత్త విధానం రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తుందని భావిస్తోంది. భవిష్యత్ విద్యుత్ అవసరాలను భరోసానిచ్చే ఈ పాలసీకి ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అం తకుముందు డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యం లో గ్రీన్ ఎనర్జీ పాలసీపై స్టేక్ హోల్డర్స్‌తో సదస్సు నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకున్నారు. వారి సలహాలను క్రోడీకరించి సమగ్రమైన పాలసీని ప్రభుత్వం రూపొందించింది.

కాలుష్యం తగ్గుదల 

గ్రీన్ ఎనర్జీ పాలసీ వల్ల రాష్ట్రంలో ఇప్పుడున్న కాలుష్య కారక తీవ్రత పదేండ్లలో 33 శాతం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్ తదితర అభివృద్ధి పనులతో భవిష్యత్తులో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరగనుంది.

2024-25లో రాష్ట్రం లో 15,623 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఉండగా.. 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని సర్కారు అంచనా వేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం పెంచుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ పాలసీ ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ సంకల్పంతో ఉంది.

అందులో భాగంగానే కొత్త విధానం ద్వారా సౌర విద్యుత్ తోపాటు ఫ్లోటింగ్ సోలార్, విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను అందించాలన్న విధానాన్ని ప్రభుత్వం ఈ పాలసీలో చేర్చింది. 

సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లకు ప్రోత్సాహం

తెలంగాణ సౌర విద్యుత్తు ఉత్పత్తికి అనువైన రాష్ట్రం. ఇక్కడ ఏడాదిలో 300 రోజులు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు బలమైన గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పవన విద్యుత్తు ఉత్పత్తికి మెండుగా అవకాశాలున్నాయి. అందుకే కొత్త విధానంలో సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు స్థాపించేందుకు ముందుకు వచ్చేవారిని నూతన పాలసీ ద్వారా ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. 

పాలసీలోని కీలకాంశాలు 

* ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ-ఐపాస్ ద్వారా వేగంగా అన్నిరకాల అనుమతులు.

* ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సౌర ప్లాంట్ల ఏర్పాటు

* రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాలు సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రోత్సాహం. 

* రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన వారు డిస్కంలకు లేదా ప్రైవేటు సంస్థలకు బహిరంగంగా అమ్ముకునే అవకాశం 

* ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో కొత్త ప్లాంట్లకు అనుమతి. వీటికి ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు సర్కారు ఇవ్వనుంది.

* పునరుత్పాదక విద్యుత్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆవిష్కరణలకు ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు

* కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రోత్సాహం 

* ఫ్లోటింగ్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయింపు.

* 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం. డిస్కంలు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి.

* సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, ఇతర పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. వాటికి సీలింగ్ పరిమితి ఉండదు. భూ వినియోగ మార్పిడి అనుమతులు అవసరం లేదు.

* ప్లాంట్ల స్థాపనకు కొనుగోలు చేసిన భూములకు 100 శాతం స్టాంప్ డ్యూటీని రీయింబర్స్

* పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు, ఎన్వోసీలను మినహాయింపు.

* సోలార్ ప్లాంట్లకు నీటి ఛార్జీలను రీయింబర్స్ చేస్తారు. సోలార్, పవన విద్యుత్తును వినియోగించే ఎంఎస్‌ఎంఈ సంస్థలకు 8 ఏండ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మాఫీ వర్తిస్తుంది. 

* మూల ధన పెట్టుబడిలోనూ రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లింపు.