calender_icon.png 19 October, 2024 | 7:49 AM

నౌ హేరా బెయిల్ రద్దు

19-10-2024 01:46:28 AM

  1. 56౦౦ కోట్లు ముంచిన హీరా గ్రూప్ ఎండీ
  2. గత ఉత్తర్వుల ఉల్లంఘనతో సుప్రీం ఉత్తర్వులు  

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్కీముల పేరుతో అక్రమంగా డిపాజిట్లు సేకరించి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరా గ్రూప్ ఎండీ నౌహేరీ షేక్ బెయిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దుచేసింది. గత ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆమె బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అలాగే ఈ కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను ముగిస్తున్నట్లు స్పష్టం చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌తోపాటు, ఐపీసీలోని తీవ్ర నేర ఆరోపణల కింద విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 10, 2020న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే కేసుకు సంబంధించి నౌ హేరాతోపాటు ఎస్‌ఎఫ్‌ఐఓ, సీకే మౌలా షరీఫ్ సర్వోన్నత న్యాయస్థానంలో వేరు వేరుగా పిటిషన్లు వేశారు.

ఈ ఏడాది ఆగష్టు 23న ఈ పిటిషన్లను జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారం క్రిమినల్ కేసు కిందకు రాదని, ఆర్థిక నేరంగా పరిగణించి తనకు బెయిల్ ఇవ్వాలని నౌహేరా షేక్ కోరారు. తదుపరి విచారణ లోపు రూ.580 కోట్ల డిపాజిట్లను మదుపరులకు తిరిగి చెల్లిస్తానని అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు నివేదించారు.

ఈ అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. 5 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇందులో ఏ షరతును అతిక్రమించినా బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ, ఈడీ చట్టం ప్రకారం ముందుకు వెళ్లొచ్చని సూచించింది.

శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆగష్టు 23న ఇచ్చిన ఆదేశాలను హీరా గోల్డ్ అమలు చేయలేదని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో నౌహేరా బెయిల్ రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. 

రూ. 5,600 కోట్ల డిపాజిట్లు సేకరణ

హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో సుమారు 1.72 లక్షల మందినుంచి దాదాపు రూ.5600 కోట్ల డిపాజిట్ల సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో డిపాజిటర్లను హీరా గ్రూప్ మోసం చేసింది. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో 24 కంపెనీలు ప్రారంభించి అనేక స్కీములతో డిపాజిటర్లను హీరా గ్రూప్ ఆకర్షించినట్లు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

24 కంపెనీల కోసం దేశవ్యాప్తంగా 182 బ్యాంక్ ఖాతాలను హీరా గ్రూప్ తెరిచింది. యుఏఈ, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాల్లో 20 బ్యాంక్ అకౌంట్లను నౌహేరా నిర్వహించారు. ఇందుకోసం ఆర్థిక నియంత్రణ సంస్థల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. దీంతో ఈడీ రంగంలోకి దిగి పుడ్ ఐటమ్స్, గోల్డ్, టెక్స్‌టైల్స్ బిజినెస్ పేరుతో హీరా సంస్థ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కేసు నమోదుచేసింది. సుమారు రూ.౩00 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది.