calender_icon.png 18 November, 2024 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పుడు భారత్‌లోనే బంగారం చౌక

18-11-2024 12:31:48 AM

గల్ఫ్ దేశాల్లోకన్నా తక్కువ

న్యూఢిల్లీ, నవంబర్ 17: బంగారం ధరల ట్రెండ్‌లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. పుత్తడి కొనుగోళ్లకు స్వర్గధామాలు గా భావించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమాన్ తదితర గల్ఫ్ దేశాలు, సింగపూర్‌ల కంటే ఇప్పుడు భారత్‌లోనే చౌకగా లభిస్తున్నది. అంతర్జాతీయ ట్రెండ్, యూఎస్‌లో చోటుచేసుకున్న రాజకీయ మార్పు, అక్కడి ఆర్థిక గణాంకాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల కదలికలు ప్రధాన కారణంకాగా, ఆయా దేశాల్లో పన్నులు, నియంత్రణలు, స్థానిక డిమాండ్ ఆధారంగా దేశీయ ట్రెండ్ నడుస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడయ్యే కామెక్స్ ఔన్సు గోల్డ్ ఫ్యూచర్ ధర నవంబర్ 16న 2,570 డాలర్ల వద్ద నిలిచింది. యూఎస్ స్పాట్‌లో ఇది 2,563 డాలర్ల వద్ద ఉన్నది. అదే రోజున భారత్‌లో 24 క్యారెట్ల పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర స్పాట్ మార్కెట్లో రూ.75,650 పలికింది. 22 క్యారెట్ల అభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.69,350, మరోవైపు భారత కరెన్సీ ప్రకారం ఒమాన్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,763 కాగా (ఇండియా ధరకంటే రూ.220 ఎక్కువ), ఖతార్‌లో రూ.76,293గా ఉన్నది. 

కారణాలివి..

* గ్లోబల్ ట్రెండ్: అంతర్జాతీయంగా గత మూడేండ్లలో ఎన్నడూలేనంతగా గతవారం బంగారం ధర తగ్గింది. యూఎస్‌లో స్పాట్ బంగారం ధరలు 4.5 శాతం పడిపోయి రెండు నెలల కనిష్ఠస్థాయి 2,563 డాలర్ల వద్ద నిలిచింది. ట్రెంజరీ ఈల్డ్స్ గరిష్ఠస్థాయిలో స్థిరపడటం, డాలరు బలపడటం ఇందుకు ప్రధాన కారణం.

అయితే డాలర్లలో ట్రేడయ్యే బంగారం ఇతర దేశాల్లో యూఎస్‌కంటే ఖరీదవుతుంది. ఎందుకంటే డాలరు బలపడినప్పుడు ఆయా దేశాల కరెన్సీలు బలహీనపడతాయి. బలహీన కరెన్సీతో డాలరు రూపేణా బంగారం ధర ఎక్కువపడుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో పండుగ, పెండ్లిళ్ల సీజన్‌తో భౌతిక బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది.

దీనితో వారం క్రితం ఔన్సు బంగారంపై 3 డాలర్లుగా ఉన్న  ప్రీమియం నవంబర్ 16తో ముగిసినవారంలో 16 డాలర్లకు పెరిగింది. అయితే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, గ్లోబల్ ట్రెండ్ కారణంగా భారత్‌లో బంగారం ధరలు సెప్టెంబర్ గరిష్ఠస్థాయి నుంచి భారీగా దిగివచ్చాయి.  

* భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు: మధ్యప్రాచ్యంలో ప్రత్యేకించి ఇజ్రాయిల్, గాజా యుద్ధం కొనసాగుతున్నందున, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ సురక్షిత సాధనంగా పరిగణించే బంగారంలోకి ఇన్వెస్టర్ల పెట్టుబడులు వస్తున్నాయి. దీనితో గల్ఫ్ దేశాల్లో పుత్తడి ధర ఎక్కువగా పెరుగుతున్నది. 

* కరెన్సీ, దిగుమతి వ్యయాలు: ఆయా ప్రాంతాల కరెన్సీ మారకపు రేటు వ్యత్యాసాలు, అధిక దిగుమతి వ్యయాలు బంగారం ధరలో కీలకపాత్ర వహిస్తాయి. స్థానిక మార్కెట్ పరిస్థితులు, పన్నులు, రవాణా వ్యయాలు కూడా పుత్తడి ధరల్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా వివిధ దేశాల్లో, ప్రాంతాల్లో ధరల మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది.