20-04-2025 12:00:00 AM
ప్రియదర్శి టైటిల్ రోల్‌లో కనిపించనున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. రూపా కొడవాయూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, సాయిశ్రీనివాస్ వడ్లమాని కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు మోహనకృష్ణ మీడియాతో పంచుకున్నారు.
“జాతకాల విషయంలో నేను మధ్యస్తంగా ఉన్నా. ఎందుకంటే నాకు చెప్పినవి కొన్ని జరిగాయి.. కొన్ని జరగలేదు. 2016 జూన్‌లో జెంటిల్ మాన్ సినిమా విడుదలైంది. సరిగ్గా వారం రోజులు ముందు నాకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదం గురించి సరిగ్గా ఏడాది క్రితం.. అంటే 2015లోనే ఒకాయన నన్ను హెచ్చరించారు. ఒకరోజు 2016 మే నుంచి ఆగస్టు మధ్యలో డ్రైవర్ లేకుండా ప్రయాణించకండి అని ఆయన చెప్పారు.
నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. సరిగ్గా 2016 జూలైలో నాకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆయన మాటలు గుర్తొచ్చి మీకెలా ఇది ముందే తెలుసు అని అడిగాను. కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి.. వాటి ద్వారానే చెప్పానని ఆయన అన్నారు. ఆ తర్వాత ఒకాయన నా జాతకచక్రం మొత్తం వేసి.. ‘సినిమాలపై ఇంట్రెస్ట్ అంటున్నారు కదా! అయితే మీకు 32 ఏళ్లు వచ్చేవరకు మీ ఫస్ట్ సినిమా తీయలేరు’ అని చెప్పారు.
సరిగ్గా నేను నా 32 ఏళ్ల వయసులోనే తొలి సినిమా తీశాను. అలాంటివి కొన్ని జరిగాయి. అవి కాకుండా కొన్ని అడపాదడపా చెప్పినవి జరగలేదు. సో జాతకాలను ఇంకా స్టడీ చేసే ప్రాసెస్‌లోనే ఉన్నానని చెబుతాను. నమ్మకం అనేది వ్యక్తిగతం.. మీకున్న నమ్మకాన్ని పది మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసేలా నమ్మొద్దు అన్నదే నా ఐడియా. ఆ పాయింట్‌నే కామెడీగా చూపించాం.
దానిపై కూడా ఎవరైనా వచ్చి గొడవ చేస్తే ఏం చేయలేం. జాతకాలన్నీ మూఢనమ్మకాలు.. నమ్మేవాళ్లందరూ దద్దమ్మలు అని నేను అనడం లేదు. ఎందుకంటే నాకే కొన్ని జరిగాయి.. కొన్ని జరగలేదు. గడిచిన 20 ఏళ్లలో వచ్చిన ప్రధానమైన మార్పు అటెన్షన్ స్పాన్. ఇప్పుడు తెరకి మనుషులకు మధ్య వేరే వస్తువులు లేస్తున్నాయి. సినిమాకు వెళ్లామంటే హీరో ఇంట్రడక్షన్ సీన్‌కే ఒక 50 ఫోన్లు గాల్లోకి లేస్తున్నాయి.
ఒకప్పుడు సినిమాకు వెళ్లామంటే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయేవి. ఆ సినిమా ప్రపంచంలోకి మనం వెళ్లిపోయేవాళ్లం. ఇప్పుడు తెరకు మనిషికి మధ్య కొత్త ప్రపంచం ఏర్పడింది. ప్రేక్షకులు సెల్‌ఫోన్‌ను పాకెట్‌లో నుంచి తీయకుండా ఏం చేయాలన్నదే ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ ముందు ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్.
అలా అని సినిమాను ఫాస్ట్‌గా కట్ చేసినంత మాత్రాన సినిమా చూడరు. ఏదోవిధంగా ఎంగేజ్ చేయాలి. ఎమోషనల్‌గా ఏదో ఒకటి కనెక్ట్ అయితేనే జనాలు సినిమాలు చూస్తారు. ఒకప్పుడు కాలక్షేపం కోసమే సినిమాలు చూసేవారు. ఇప్పుడు కచ్చితంగా ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే చూస్తున్నారు” అని చెప్పారు.