28-04-2025 12:53:45 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 27 (విజయ క్రాంతి) : యువ రచయిత కోటల సాయితేజ (సన్నీ కోటల) రాసిన తొలి నవల‘దట్ బాయ్ తాత‘ను ప్రముఖ నవలాకారుడు చేతన్ భగత్ ముంబయిలో ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ కు చెందిన సన్నీ, తన నవల ద్వారా నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి ప్రభావాలను చర్చించారు.
యువత తమ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఈ నవల మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు చేతన్ భగత్ పేర్కొన్నారు. ఎంబీఏ పూర్తి చేసిన సన్నీ... ప్రస్తుతం ఇక్భాయ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి చేస్తున్నాడు.
ఈ సందర్భంగా ఆయన తండ్రి, మహబూబ్నగర్ జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్ ఛైర్మన్ కె.ఎస్.రవికుమార్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్ననాటి నుంచే ఇంగ్లీష్ నవలలు చదవటంపై సన్నీ ఆసక్తి చూపించేవాడని తెలిపారు. ఇది తమ కుటుంబానికి, సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు అందించాలని ఆకాంక్షించారు.