calender_icon.png 23 September, 2024 | 4:47 PM

3 నెలల్లో బఫర్ జోన్లను నోటిఫై చేయండి

25-07-2024 01:54:42 AM

హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): హెచ్‌ఎండీయే పరిధిలోని చెరువులన్నింటికీ 3 నెలల్లో బఫర్ జోన్లను నోటిఫై చేసి కార్యాచరణ నివేదికను సమర్పించాలని హెచ్‌ఎం డీఏ కమిషనర్‌కు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రామన్నకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అక్రమ నిర్మాణాలపై హ్యూమన్ రైట్స్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ పిల్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

గత ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ కమిషనర్ మహమ్మద్ సర్ఫరాజ్ ఆన్లైన్లో హాజరై తమ పరిధిలో 3,500 చెరువులకుగాను 2,525 చెరువుల బఫర్ జోన్లను గుర్తించినట్టు తెలిపారు. హద్దులకు సంబంధించి వివాదాల పరిష్కారానికి 4 నెలల గడువు కావాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తుది నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 230 చెరువుల బఫర్‌జోన్, ఎఫ్టీఏలను గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు.

2,525 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని, దీనిపై అభ్యంతరాలు స్వీకరించి తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందన్నారు. రామన్నకుంట ఎఫ్టీఎల్ పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ భవనానికి చెందిన స్థలం కొంత మేర ఎఫ్టీఎల్లో ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. దీన్ని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బఫర్‌జోన్, ఎఫ్టీఏలను నోటిఫై చేయడంతోపాటు అక్రమ నిర్మాణాల తొలగింపునకు చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని హెచ్‌ఎండీఏని ఆదేశిస్తూ విచారణను నవంబరు 4కు వాయిదా వేసింది.