calender_icon.png 10 October, 2024 | 12:52 PM

12 ఆలయాల పాలకమండళ్లకు నోటిఫికేషన్

04-09-2024 12:29:02 AM

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో తిరుమల స్థాయిలో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ  ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు జనగామ జిల్లాలోని 12 నోటిఫైడ్ ఆలయాలకు ధర్మకర్తల మండలి నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ ఆలయాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రముఖమైంది.

ఇతర ఆలయాలు ఇవీ..

పాలకమండళ్ల నియామకానికి వేములకొండ మత్సగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, దండుమల్కాపురం ఆందోల్ మైసమ్మ ఆలయం, నల్లగొండ జిల్లాలోని జడల రామలింగేశ్వరస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం,   కోటమైసమ్మ ఆలయం, సూర్యాపేట జిల్లాలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, జనగామ జిల్లాలోని లక్ష్మీనరసింహునికి ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, సిద్ధేశ్వర స్వామి ఆలయం, శ్రీరామచంద్రస్వామి ఆలయాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

యాద్రాద్రి లక్ష్మీ నృసింహుడా..? లక్ష్మీనారాయణుడా..?

ఆలయ నిర్వహణలోనే కాదు.. ఆలయంలో కొలువైన దేవుళ్లు ఎవరనే విషయం పైనా దేవాదాయశాఖ అధికారులకు అవగాహన లేకుండా పోతోంది. రాష్ట్రంలోని నోటిఫైడ్ ఆలయాలకు పాలకమండళ్ల నియామకం కోసం దేవాదాయ శాఖ తాజాగా జారీ చేసిన మీడియా ప్రకటన చూస్తే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. నృసింహుని ఆలయం పేరును లక్ష్మీనారాయణ స్వామి ఆలయంగా నోటిఫికేషన్ విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది.