calender_icon.png 4 October, 2024 | 4:53 AM

ఓటర్లు @ 6,71,940

03-10-2024 01:21:29 AM

వికారాబాద్ జిల్లాలో తుది జాబితా ప్రకటన

జిల్లాలో మహిళా ఓటర్లే అధికం 

ఇక బీసీ రిజర్వేషన్ల లెక్క తేలడమే ఆలస్యం 

సమాంతరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం కసరత్తు

వికారాబాద్, అక్టోబర్ ౨ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు  అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. దీనిలో భాగంగానే తాజాగా మండలాల వారీ గా తుది ఓటర్ జాబితా ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,71,940 ఉండగా, వీరిలో 3,32,039 మంది పురుషులు, 3,39,885 మంది మహిళలు.

17 మంది ట్రాన్స్‌జెండర్లు. జిల్లాలో పురుష ఓటర్ల కంటే  మహిళా ఓటర్లు 7 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. పం చాయతీ ఎన్నికల్లో మహిళలు ఎటు మొగ్గు చూపితే అటు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓటర్ జాబితా విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు రిజర్వేషన్లపైనే అంత టా చర్చ జరుగుతున్నది.

పాత రిజర్వేషన్లే కొనసాగుతాయా? లేదా కొత్తగా రిజర్వేషన్లు ప్రకటిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతున్నది. గత ప్రభుత్వం మెజార్టీ జనాభా ఎస్టీలు ఉంటే పంచాయతీలను ఆ సామాజిక వర్గానికే రిజర్వు చేసింది. ఈ కారణంగా బీసీలకు అన్యాయం జరిగిందనే చర్చ తెరపైకి వచ్చింది.

దీంతో  ప్రభుత్వం బీసీ కమిషన్ నివేదిక కోరింది. ఇక ముందు బీసీ రిజర్వేషన్ల పెంపు విషయమై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి. అంతవరకూ వేచిచూడాల్సిందే.

మొత్తం 586 గ్రామ పంచాయతీలు

జిల్లాలో 586 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో 4,982 వార్డులు ఉన్నాయి. అధికారులు ప్రతి వార్డులో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందకు చర్య లు తీసుకుంటున్నారు.  అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికల సమయంలో కేటాయించిన పోలిం గ్ కేంద్రాలకంటే పంచాయతీ ఎన్నికలకు మరిన్ని కేం ద్రాలు పెంచనున్నా రు.

దీనిపై ఇప్పటికే పంచాయతీల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల  సమయంలో ఒక్కో గ్రామంలో రెండు నుంచి నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి వార్డుల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణం గా ఎన్నికల సిబ్బందిని సైతం కేటాయించాల్సి ఉన్నది.

ఆశావహుల్లో ఉత్కంఠ

ఓటర్ల జాబితా ప్రకటనతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో ఆశలు చిగురించాయి. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకే అధికారులు స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం పలు కారణాలతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుంది. గ్రామ పంచాయతీల పదివీ కాలం జనవరి 31తో ముగిశాక  ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన  సాగుతోంది.

ప్రత్యేకా ధికారుల పాలన ప్రా రంభమై పది నెల లు కావడంతో ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఇటు ప్రత్యేకా ధికారిగా, అటు ప్రభుత్వశాఖ పనులను చేయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.