- 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
- కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారా యణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వర్సిటీ పరిధిలోని వైద్య, దంత కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదివారం ఉదయం 6 నుంచి 13వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను వర్సిటీ పరిశీలించిన తరువాత తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఇతర సమాచారం కోసం www.knru hs.telangana.gov.in ను సందర్శించాలని అధికారులు తెలిపారు.
పీజీ డెంటల్ వైద్య ప్రవేశాలకు..
పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ ఎండీఎస్ పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎండీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 8న సాయం త్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇతర సమాచారానికి http://www.knruhs. telangana.gov.inను సంప్రదించాలని అధికారులు తెలిపారు.