calender_icon.png 24 November, 2024 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్

26-09-2024 03:27:30 AM

  1. 612 పోస్టుల భర్తీకి సిద్ధమైన వైద్యారోగ్య శాఖ
  2. మెడికల్ ఆఫీసర్ల భర్తీకి రంగం సిద్ధం

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ దవాఖాన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. గడిచిన 15 రోజుల్లోనే సుమారు 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో సుమారు 1,600 మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తామని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఇప్పటి వరకు 7308 పోస్టుల భర్తీ

కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, హాస్పిటళ్ల అప్‌గ్రేడెషన్‌తో ప్రభుత్వ దవాఖాన్లలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పోస్టులన్నీ భర్తీ చేసి, వైద్య సేవలను మెరుపరుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గతంలోనే ప్రకటించారు.  2017, 2018 నుంచి ఆగిపోయిన ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్, ఇతర కేసులకు కోర్టులో తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.

నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఫలితాలను విడుదల చేయించి, ఒకేసారి 6,956 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు. 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లను, 48 మంది ఫిజియోథెరపిస్టులను, 18 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను రిక్రూట్ చేశారు. మొత్తంగా ఇప్పటివరకూ 7,308 పోస్టులను భర్తీ చేశారు.

4 వేల పోస్టులకు నోటిఫికేషన్లు

గత 15 రోజుల్లోనే 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెం ట్ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నెల 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 17న మరో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండ్రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

వీటితోపాటు 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్), 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 435 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్‌స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మొత్తంగా మొత్తంగా 6,293 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్లో ఇప్పటికే 643 మంది కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని  రిక్రూట్ చేశారు.

మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీల్లో సుమారు 3,500 పోస్టులకు ఇటీవల కేబినేట్ ఆమోదం తెలిపినట్టు అధికారులు చెప్తున్నారు. వాటిని కూడా భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.