calender_icon.png 20 September, 2024 | 5:30 AM

ధాన్యం అక్రమాలపై రాష్ట్రానికి నోటీసులు

07-09-2024 12:36:17 AM

విచారణను 4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యం ప్రైవేట్ కంపెనీలకు విక్రయాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపైరాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు  నోటీసులు జారీ చేసింది.  ఈభూ ధాన్యాన్ని దక్కించుకున్న ప్రైవేటు కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరాధే. జస్టిస్ శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది.

పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యం ప్రైవేటు కంపెనీలకు ఈవేలం ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు ఎందుకు జరిగాయో చెప్పాలంది. ప్రతివాదులైన ప్రతివాదులైన పౌరసరఫరాలశాఖ ముఖ్యకార్యదర్శి, పౌరసరఫరాల సంస్థ ఎండీ, కమిషనర్, జనరల్ మేనేజర్, మార్కెటింగ్ జనరల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈటెండరు దక్కించుకున్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్, మంచుకొండ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఎంట్ర్పజెస్, ఎల్జి ఆగ్రి ఇండస్ట్రీస్‌లకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ధాన్యం కొనుగోలుకు నిర్వహించిన టెండరులో పేర్కొన్నదాని కంటే మిల్లర్ల నుంచి అదనంగా వసూలు చేయడంపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్ దాఖలు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధరకంటే తక్కువ ధరకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి రూ.1100 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పారు. వాదనల తర్వాత ధర్మాసనం, ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణను వాయిదా వేసింది.