ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలన్న సుప్రీం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తాత్కాలిక డీజీపీల నియామక వ్యవహారంలో తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక డీజీపీలను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 8న సావిత్రి పాండే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక డీజీపీలను నియమిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి తోడుగా ప్రకాశ్‌సింగ్ కేసులో వెలువడిన నిబంధలను పొందుపరిచారు. ఈ పిటిషన్‌పై సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. డీజీపీ నియామకానికి సంబంధించి ౩ నెలల ముందే ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుందని పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వొకేట్ వాదనలు వినిపించారు.
డీజీపీ పోస్ట్ ఖాళీ కావడానికి ౩ నెలల ముందే యూపీఎస్సీ చైర్మన్ నేతత్వంలోని ముగ్గురితో కూడిన ఒక ప్యానల్ కమిటీకి రాష్ట్రంలో డీజీ ర్యాంక్‌లో ఉన్న అధికారుల పేర్లను పంపాల్సి ఉంటుందన్నారు. మెరిట్స్, సీనియారిటీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని యూపీఎస్సీ కమిటీ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుందని కోర్టుకు నివేదించారు.
ఈ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించుకొనే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. ఈ నిబంధనలకు విస్మరించి రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక డీజీపీలను నియమిస్తున్నాయని వాదించారు. ప్రతివాదుల కింద తెలంగాణ, ఏపీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లను పిటిషనర్ చేర్చారు.
అయితే పిటిషనర్ తరపు వాదనలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం, ఏడు రాష్ట్రాల్లో అఫిడవిట్ లు దాఖలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను నవంబర్ 19 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.