21-03-2025 12:53:53 AM
నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి వజ్ర లింగం
రాజేంద్రనగర్, మార్చి 20 (విజయ క్రాంతి): శంషాబాద్ మండల పరిధిలోని నర్కుడ గ్రామంలో ఉన్న ఆర్‌ఎంసి ప్లాంట్ కు పంచాయితీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ’నర్కుడ పై కాలుష్యపు పడగ’ శీర్షికతో ఈనెల 18న విజయ క్రాంతి పత్రికలో సమగ్ర వివరాలతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. నర్కుడ గ్రామంలో చాలా రోజులుగా ఆర్‌ఎంసి ప్లాంట్ ఉండటంతో తీవ్రమైన దుమ్ము, ధూళి రావడంతో చిన్నారులు, వృద్ధులు గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అదేవిధంగా ఆర్‌ఎంసి ప్లాంట్ నిబంధనలకు విరుద్ధంగా 111 జీఓ లో కొనసాగుతోంది. ఈ వివరాలతో విజయక్రాంతి కథనం ప్రచురించింది. ఈమేరకు ఎంపీడీవో మున్ని, ఎంపీవో ఉషా కిరణ్ రెడ్డి ఆదేశాలతో స్థానిక పంచాయతీ కార్యదర్శి వజ్ర లింగం గురువారం ఆర్‌ఎంసి ప్లాంటు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. మూడురోజుల లోపు ఆర్‌ఎంసి ప్లాంట్ కు ఉన్న అనుమతులు, ఇతర వివరాలు అన్ని సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే పంచాయతీ యాక్టు ప్రకారం ముందుకు వెళ్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయ క్రాంతి కథనానికి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.