calender_icon.png 24 October, 2024 | 7:01 AM

వ్యర్థాల నిల్వపై విరించి ఆసుపత్రికి నోటీసులు

11-07-2024 12:49:57 AM

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): వ్యర్థాలను ఇంటిపక్కన గుంత తీసి నిల్వ ఉంచడంపై ప్రేమ్‌నగర్‌లోని విరించి ఆసుపత్రికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుంతను పూడ్చివేసి దవాఖానపై తక్షణం చర్యలు తీసుకొనేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తన ఇంటిపక్కన విరించి యాజమాన్యం గుంత తీసి వ్యర్థాలను నిల్వ చేస్తున్నదని ఖైరతాబాద్‌కు చెందిన రిజ్వాన్‌ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

దీనిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇంటి పక్కనే గుంత తీసి వ్యర్ధాలు వేస్తున్నారని, దీనివల్ల కాలుష్యం ఏర్పడుతోందని, దీనిపై వినతి పత్రాలు సమర్పించినా అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయితే ప్రతివాదుల వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులైన దవాఖానతోపాటు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి తదితరులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.