స్టే ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మిషన్ ఛబుత్రా, ఆపరేషన్ రోమియో వంటి పేర్లతో పోలీసులు నిర్వహిస్తున్న సోదాలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకో ర్టు నోటీసులు జారీచేసింది. సోదాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పోలీసుల సోదా లను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్‌క్యూ మసూద్ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ.. చిన్న వ్యాపారులు, ఫుట్‌పాత్ వ్యాపారులను రాత్రి 10.30 నుంచి 11 గంటల్లోపే మూసివేయిస్తున్నారని, ఇది 2015లో జారీ చేసిన జీవో 15కు విరుద్ధమని తెలిపారు. పేదలు నివసించే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మిషన్ ఛబుత్రా, ఆపరేష న్ రోమియో పేర్లతో నిర్వహిస్తున్న సోదాలను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. పిటిషనర్ ఇంటిలోనూ సోదాలు చేశారని, తానూ బాధితుడేనని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను విన్న ధర్మాసనం హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు మ్యాప్స్ ఇన్ఫ్రా
వివరణ ఇవ్వాలంటూ పోలీసులకు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ఇరిగేషన్ శాఖాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలంటూ మ్యాప్స్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్టనర్ పీ సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖ లుచేశారు. దీనిపై జస్టిస్ కే సుజన బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాము కొనుగోలు చేసిన భూమిలోనే నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ భూమిని మరో వ్యక్తి నుంచి కొనుగోలు చేసి అన్ని అనుమతులతో నిర్మాణాలు చేపట్టామన్నారు. అయితే కక్షసాధింపు చర్యలతోనీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. వాదనలను విన్న న్యాయ మూర్తి పోలీసులు, ఇరిగేషన్ శాఖ వివరణ కోరుతూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.