calender_icon.png 24 October, 2024 | 3:48 AM

సహకార సంఘాలకు నోటీసుల దడ

24-10-2024 12:57:22 AM

  1. భారంగా మారుతున్న ఆదాయపు పన్ను
  2. జిల్లాలో 19 సంఘాలకు నోటీసులు
  3. పెనాల్టీ మినహాయించాలని సంఘాల విజ్ఞప్తి

మెదక్, అక్టోబర్ ౨౩ (విజయక్రాంతి): రైతులకు వెన్నుదన్నుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఆదాయపు పన్ను శాఖ గుబులు పుట్టిస్తోంది. మెదక్ జిల్లాలో సహకార సంఘాల లావాదేవీలు, క్రయవిక్రయాలు తదితర వాటిపై ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడంతో సంఘాలు కంగుతింటున్నాయి.

ఇప్పుడిప్పుడే ఎరువులు, విత్తనాల విక్రయాలతో పాటు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటూ నిలదొక్కుకుంటున్న సంఘాలకు నోటీసులు రావడం తో సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. క్రయవిక్రయాలపై వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలని ఐటీ, సంఘాలు నిర్వహించే సేవా రంగాలు, వ్యాపార లావాదేవీలకు జీఎస్టీ నోటీసులు రావడంతో సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

19 సంఘాలకు నోటీసులు

జిల్లాలో వివిధ సహకార సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లించాలని నోటీసులు రావడంతో సంఘాలు విస్తుపోతున్నాయి. జిల్లాలోని 37 సహకార సంఘాలు రైతుల కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో 19 సం ఘాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులను జారీ చేసింది.

గతంలో సంఘాలు కేవలం పంట రుణాలు తదితర వాటికి పరిమితం కావడం, బినామీ పేరుతో చాలామంది రుణాలు తీసుకోవడంతో నష్టాల్లో కూరుకుపోయాయి. ఇప్పటికీ కొన్ని సంఘాలు నామమాత్రంగానే ఉన్నాయి. కొన్ని సంఘా లు ఎరువులు, విత్తనాలు విక్రయించడం, రైతుల నుంచి కమీషన్‌తో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం, పెట్రోల్ బంకులు, సూపర్ మార్కె ట్లు నిర్వహించి ఆదాయాన్ని  పెంచుకొని నిలదొక్కు కుంటు న్నాయి.

కొన్ని సంఘాలు రైతుల నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు లు చేసే డిపాజిట్లు, తీసుకునే వడ్డీ పైనా పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. వాటిపై కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించి రైతుల డిపాజిట్ల వివరాలను అందించడంతో మినహాయింపు లభిం చింది.

అయితే, కొన్ని మా త్రం ఎలాంటి స్పం దన చూపకపోవడంతో క్రయవిక్రయాలపై తాజాగా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నోటీసులపై కమిషనర్‌ను కలిసి రైతుల సేవలకు సంబంధించిన లావాదేవీలపై ఆదాయ పు పన్ను మినహాయించా లని కోరనున్నట్లు పలు సంఘాల చైర్మన్లు తెలిపారు. 

జీఎస్టీ పరిధిలోకి..

వాణిజ్య పన్నుల శాఖ గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. అప్పుడు సంఘాలు నిర్వహించే వాటిపై పన్ను ఉండేది కాదు. 2017 జూలై 1 నుంచి వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని పన్నుల వసూళ్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీఎస్టీ కిందకు వెళ్లాయి. ఎరువుల విక్రయాలపై 5 శాతం, పురుగు మందుల విక్రయాలపై 18 శాతం పన్నును సంఘాలు జీఎస్టీ రూపంలో చెల్లించాల్సి వస్తోంది.

గతంలో మాదిరిగానే సంఘాలు ఆదాయ, వ్యయాలకు సంబంధించి లెక్కలు చూపించడం లేదు. 2017 నుంచి 2021 వరకు సంవత్సరం వారీగా ఆదాయ, వ్యయ వివరాలను తెలియజేయాలంటూ నోటీసులు రావడంతో సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో సహకార సంఘాలు ఛార్టెడ్ అకౌంటెంట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని సంవత్సరం వారీగా ఆదాయ, వ్యయ లెక్కలు అప్పజెప్పే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

2017 నుంచి చెల్లించాలని..

జిల్లాలోని 19 సహకార సంఘాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీ సులు జారీ చేసింది. కమర్షియల్‌గా బలోపేతమైన సంఘాలను గుర్తిం చి వారికి 2017 నుంచి ఇప్పటి వరకు ఆదాయ పన్నును చెల్లించాలని నోటీసులు ఇచ్చా రు. అయితే, ఈ విషయంలో సంఘాల సభ్యు లు పెనాల్టీ లేకుండా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

 కరుణ, 

జిల్లా సహకార శాఖ అధికారి