calender_icon.png 24 January, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంపలేమీ మునిగిపోవు

18-09-2024 04:32:20 AM

  1. బుల్డోజర్ న్యాయాన్ని ఒప్పుకొనేదే లేదు
  2. ముందస్తు అనుమతి లేకుండా కూల్చేయొద్దు
  3. అక్టోబర్ 1వ తేదీ వరకు కూల్చివేతలు వద్దు
  4. రోడ్లు, నీటి వనరులు వంటి ఆక్రమణలకు ఇది వర్తించదు
  5. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అక్రమ కట్టడాల పేరుతో దేశంలోని ఏ ఒక్క కట్టడాన్ని అక్టోబర్ 1వ తేదీ వరకు కూల్చటానికి వీలులేదని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమ కట్టడాల తొలగింపునకు కోర్టు నియమావళిని రూపొందిస్తుందని, అప్పటివరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టంచేసింది. రోడ్లు, నీటి వనరులు, రైల్వే ట్రాక్ వంటి ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు ఈ ఆదేశాలు వర్తించవని పేర్కొన్నది. ‘అక్రమం’ అనేదానిని నిర్ణయించేది కార్యనిర్వాహక విభాగం కాదని, అది న్యాయ విభాగం పని అని తేల్చి చెప్పింది.

పలు కేసుల్లో ఇరుక్కున్నవాళ్లు అధికారులు తమ నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని, వాటిని ఆపేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. తదుపరి విచారణ వరకు అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆపినంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవని స్పష్టంచేసింది. 

కోర్టు తీర్పు ఉన్నా కూల్చివేతలే..

కూల్చివేతలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో అధికారులు కూలుస్తూనే ఉన్నారని పలువురు పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘కూల్చివేతలు రోజూ కొనసాగుతూనే ఉన్నాయి. బుల్డోజర్ న్యాయం పనికిరాదని సుప్రీంకోర్టు గతవారం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేతలు ఆగటం లేదు. కేసుల్లో నేరస్తులుగా ఉన్నారని చెప్పి నివాసాలు కూల్చటం చట్ట వ్యతిరేకం. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు తదుపరి విచారణను త్వరగా చేపట్టండి’ అని కోరారు.

మాపై ఎవరి ప్రభావం ఉండదు

బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను  ఈ నెల రెండున సుప్రీంకోర్టు విచారించి కట్టడాల కూల్చివేత రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టంచేసింది. ఏదైనా కేసులో నిందితుడు, దోషిగా ఉన్నంత మాత్రాన వారి నివాసాలను ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. ఈ బుల్డోజర్ న్యాయం రాజ్యాంగాన్ని, చట్టాలను బుల్డోజ్ చేయటమేనని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

కోర్టు తీర్పు వల్ల చట్టబద్ధంగా అనుమతి పొందిన కూల్చివేతలపై కూడా ప్రభావం చూపుతుందని వాదించారు. ముస్లింల నివాసాలనే కూలుస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నదని, ఆ ప్రచారానికి కోర్టు కూడా ప్రభావితం అయ్యిందని మెహతా ఆరోపించారు. అందుకు ధర్మాసనం స్పందిస్తూ ఎలాంటి కథలు, కథనాలు తమను ప్రభావితం చేయలేవని స్పష్టంచేసింది. ‘ఏ రకమైన కథనాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అక్రమ కట్టడాల కూల్చివేతలను ఆపాలని మేం చెప్పటం లేదు.

కానీ, ఏది ‘అక్రమం’ అని కార్యనిర్వాహక విభాగం నిర్ణయించలేదు. అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు కోర్టు మార్గదర్శకాలను రూపొందిస్తుందని మరోసారి స్పష్టంచేస్తున్నాం. మా ఆదేశాలు రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, నీటివనరుల్లో అక్రమ కట్టడాలకు వర్తించవు’ అని తేల్చి చెప్పింది.