calender_icon.png 15 November, 2024 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ వ్యాపారవేత్త శరత్‌గోపాల్ కన్నుమూత

20-07-2024 04:05:00 AM

  1. పలు రంగాల్లో ఎన్నో ఘనతలు సాధించిన వ్యక్తి
  2. దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద మాల్ నిర్మాణం
  3. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటు

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ప్రముఖ వ్యాపార వేత్త బొప్పన శరత్ గోపా ల్ శుక్రవారం స్వర్గస్తులయ్యారు. విద్య, ఫార్మా, రియల్ ఎస్టేట్, తయారీ రంగాల్లో అగ్రగణ్యుడిగా పేరొందిన ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థి వదేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 13/ఏ, ఫ్లాట్ నంబర్ 155లో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ విన్సర్‌వ్యాలీ లోని వైకుంఠ మహాప్రస్థానంలో శనివారం ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

వివిధ రంగాల్లో శరత్ గోపాల్ ప్రత్యేకతను చాటుకున్నారు. అనేక పరిశ్రమలను నెలకొల్పారు. ఆయన నిర్మించిన శరత్ సిటీ క్యాపిటల్ మాల్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్‌గా రికార్డు సృష్టించింది. బల్క్ డ్రగ్స్ తయారీలో ఆయన స్థాపించిన మ్యాట్రిక్స్ లాబోరేటరీస్ లిమిటెడ్ అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా గోసమితి, వృద్ధాశ్రమాలు, వేదశాలలకు భారీ విరాళాలు ఇచ్చి తన సామాజిక స్పృహను చాటుకున్నారు. 

ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్ చేసి..

శరత్ గోపాల్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా పెంజెండాలో 1949లో జన్మించారు. ఆయన వరంగల్ నిట్‌లో 1974లో మెటలర్జీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1978లో ప్రీమియర్ ఎక్విప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. అనంతరం కెమికల్ ప్రాసెస్ మెషినరీ సంస్థను స్థాపించడంతో పాటు దానికి ప్రమోటర్, డైరెక్టర్‌గా వ్యవహరించారు. అనంతరం 1988లో మ్యాట్రిక్స్ లాబోరేటరీస్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. ఇది దేశం లో బల్క్ డ్రగ్స్‌తో పాటు ఇంటర్మీడియేట్ డ్రగ్ తయారీకి ప్రసిద్ధి పొందింది. 1991లో డైమ్స్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పారు. దీనికి చైర్మన్, ఎండీగా శరత్ కొన సాగారు. ఈ సంస్థ కెమికల్ ప్రాసెస్ మెషినరీ రూపకల్పన, తయారీలో అగ్రగామిగా నిలిచింది.

ఆయన పలు వ్యాపార రంగాల్లో చేసిన కృషికి గాను 1995లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధీనంలోని ఈఈపీసీ నుంచి ఉత్తమ ఎగుమతుల పురస్కారాన్ని పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొత్తగూడలో దక్షిణాసియాలో అతిపెద్ద మాల్ అయిన శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌ను నిర్మించారు. అంతేకాకుండా కొండాపూర్‌లో ఏ గ్రేడ్ ఐటీ బిల్డింగ్‌ను నిర్మించే ప్రాజెక్టు రూపొందుతోంది. ఇలా వ్యాపార, ఫార్మానే కాకుండా విద్యా రంగంలోనూ శరత్ గోపా ల్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంజినీరింగ్ విద్యలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీకి ఆయన ఇన్వెస్టర్. ఇన్ని రంగాల్లో సేవ లందించిన శరత్ గోపాల్ మరణం రాష్ట్రానికి తీరని నష్టంగా మిగిలింది.