calender_icon.png 12 January, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేం కాదు..మీరే

12-01-2025 12:40:25 AM

  1. చర్లపల్లి అప్రోచ్ రోడ్ల నిర్మాణంపై కేంద్ర, రాష్ట్రాల పంచాయితీ
  2. ఒకరిపై ఒకరు నెట్టివేసుకుంటున్న ప్రభుత్వాలు
  3. ప్రయాణికులకు తప్పని లోకల్ రవాణా కష్టాలు
  4. ఎంఎంటీఎస్ రైళ్లు తక్కువే.. సిటీ బస్సుల రాకకు ఇరుకు రోడ్ల కష్టాలు
  5. రోడ్ల విస్తరణ చేయకుంటే తప్పని తిప్పలు

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): రూ.413 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎయిర్ పోర్టు తరహాలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ వేదికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రు ల వ్యాఖ్యలు ఇవి.  పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు చేసి అత్యత్భుతమైన టెర్మినల్ నిర్మించినా రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని రోడ్ల నిర్మాణానికి సైతం ప్రారంభోత్సవ వేదికపైనే నిధులు అడగటం చర్చనీయాంశంగా మారింది.

ఓ భారీ ప్రాజెక్టుకు నిధులు అడిగితే బాగుంటుంది కానీ మరీ ఇంత తక్కువ నిధులు ఖర్చయ్యే పనికి కూడా కేంద్రాన్ని డబ్బులు అడగటం.. దానికి కేంద్రం కూడా “మా వల్ల కాదు ఇది మీరే చేయాలి... మీదే బాధ్యత..” అంటూ చెప్పడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న రోడ్డు నిర్మాణాల కోసం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిబంధనల మేరకు ఈ రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివే. జీహెచ్‌ఎంసీ ఈ రోడ్లను నిర్మించాల్సి ఉంటుంది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారానైనా వేయించాలి.

గత ప్రభుత్వమే వేయాల్సింది..

2021లో చర్లపల్లి టెర్మినల్ పనులు ప్రారంభమైనప్పుడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ అధికారులు అప్పటి బీఆర్‌ఎస్ సర్కారుకు అప్రోచ్ రోడ్లు వేయాలని విన్నవించారు. అయితే చర్లపల్లి టెర్మినల్ నిర్మాణానికి ముందు స్థల సేకరణ కోసం రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

అయినా కూడా చర్లపల్లి పాత రైల్వే స్టేషన్‌తో పాటు ఎఫ్‌సీఐ, ఐఓసీఎల్ స్థలాలను సేకరించి రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో  అప్రోచ్ రోడ్లు నిర్మించాలని కేసీఆర్ సర్కారును ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అయినా రైల్వే శాఖ మాత్రం యథావిధిగా  రైల్వే టెర్మినల్ పనులు చేపట్టి పూర్తి చేసింది.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుకు సైతం అప్రోచ్ రోడ్ల నిర్మాణంపై విజ్ఞప్తి చేసినా తొలుత పట్టించుకున్నట్లు కనిపించలేదు. అయితే తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ రోడ్ల నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణకు అంగీకరించారు.

మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని టీజీఐఐసీ, రెవెన్యూ, అటవీ శాఖల నుంచి భూములను ఈ రోడ్ల నిర్మాణానికి ఇప్పించారు. అయితే రోడ్ల నిర్మాణం విషయంలో మాత్రం ఇంకా సమస్య కొలిక్కిరాలేదు.

రోడ్లు నిర్మించకుంటే..

అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన రైల్వే టెర్మినల్‌కు అప్రోచ్ రోడ్లు వేయకుంటే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పవు. ఆర్టీసీ బస్సులు ఇక్కడికి చేరుకోవ డం కష్టంగా మారుతుంది. ఫలితంగా నిత్యం వేలాది మంది ప్రయాణించే ఏర్పాట్లున్న ఈ స్టేషన్‌కు ప్రయాణికులు రావడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది.

సొంత వాహనాలు ఉన్నవాళ్లు చేరుకోవచ్చు కానీ సాధా రణ ప్రయాణికులకు ప్రైవేటు వాహనాల్లో ఖర్చుతో కూడుకున్న పనే. ఉదాహరణకు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రూ.400 లోపు ఖర్చుతో స్లీపర్ రైలులో వచ్చే ప్రయాణికుడు చర్లపల్లి టెర్మినల్ నుంచి నగరంలోని కూకట్‌పల్లి, శంషాబాద్, గచ్చిబౌలిలాంటి ప్రాంతాలకు చేరుకోవడానికి క్యాబ్ బుక్ చేసుకుంటే కనీసం రూ.600 నుంచి రూ.800 వరకు, ఆటో అయితే రూ.500 నుంచి రూ.600వరకు ఖర్చు అవుతుంది. సాధారణ ప్రయాణికులు ఈ ఖర్చులు భరించలేరు. అందుకే వారికి ప్రజా రవాణా తప్పనిసరి. 

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రోడ్లు వేయాలి

నగరానికి ప్రతిష్ఠాత్మకమైన రైల్వే టెర్మినల్ వచ్చింది. ఇందుకు కేంద్రం రూ.413 కోట్లు ఖర్చు పెట్టింది. అది అందుబాటులోకి కూడా వచ్చింది. దీని ఫలితంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే టెర్మినల్స్ వద్ద రైల్వే ట్రాఫిక్ అంతరాయం తగ్గనుంది. దాంతో పాటు ఆయా టెర్మినల్స్ వద్ద ప్రయాణికుల సందడి కాస్త తగ్గడంతో రోడ్డు ట్రాఫిక్ కూడా తగ్గుతుంది.

దీనివల్ల నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు కూడా తగ్గుతాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్లపల్లి అప్రోచ్ రోడ్లపై దృష్టి పెట్టి నిర్మించాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. కేంద్రం అంత చేస్తే కనీసం అప్రోచ్ రోడ్డు వేయలేని పరిస్థితి ఎందుకని డివిజనల్ రైల్వే సభ్యుడు గోపాల్ నారాయణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఎంఎంటీఎస్ రైళ్లను పెంచాలి

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను అత్యత్భుతంగా ఉందని, ఈ స్టేషన్‌ను చూసేం దుకు సైతం నగరవాసులు చర్లపల్లికి వస్తున్నారు. చర్లపల్లి టెర్మినల్ నిర్మాణమే కాకుండా చర్లపల్లి నుంచి నగరం లోని సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ, హైదరాబాద్ తదితర స్టేషన్లకు ఎంఎంటీఎస్ రైళ్లను భారీగా పెంచాలని జోనల్ రైల్వే సభ్యుడు నూర్ అహ్మద్  తెలిపారు.

ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడకుండా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు దూరప్రాంతాల నుంచి వచ్చే రైల్వే ప్రయాణికులు టెర్మినల్‌లోని మరో ప్లాట్‌ఫాం నుంచి ఎంఎంటీఎస్ రైలు ఎక్కి నగరంలోని వారి వారి ప్రాంతాలకు వెళ్లేలా చూసే బాధ్యత రైల్వే శాఖ తీసుకోవాలని ఆయన కోరారు. 

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

చర్లపల్లి టెర్మినల్‌కు అప్రోచ్ రోడ్లు వేసే బాధ్యత మేం తీసుకుంటాం.. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న తరహా రోడ్లను ఇక్కడ నిర్మిస్తాం. అయితే ఇందుకు కేంద్రం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ వేదికపైనే కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న 

* కర్ణాటకలోనూ రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్లు వేసే అంశంపై చర్లపల్లి అప్రోచ్ రోడ్ల లాంటి అంశమే తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా కేంద్రం స్థానిక రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వదు అని తేల్చిచెప్పేశాం. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లను కేంద్రం ఇచ్చింది. దక్షిణ భారత్‌లోనే అద్భుతమైన టెర్మినల్‌ను చర్లపల్లిలో ఏర్పాటు చేశాం. అప్రోచ్ రోడ్లు వేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీ సీఎం వద్ద చెప్పి ఈ రోడ్లు మీరే వేయించండి..