calender_icon.png 14 November, 2024 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

53వ పడిలోకి..

04-11-2024 02:02:27 AM

సీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీతోపాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన సీనియర్ నటి. ‘నేను నన్ను కదిలించే చిత్రాలను చేస్తాను. ముఖ్యంగా యూనిట్, దర్శకుడు నన్ను ఆకర్షించాలి’ అంటూ సెలెక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందు కెళ్తున్న టబు నేటి (సోమవారం)తో 53వ పడిలోకి అడుగుపెట్టనుంది. 

హైదరాబాదీనే 

టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. 1971, నవంబర్ 4న జమాల్ హష్మీ రిజ్వానా దంపతులకు టబు హైద రాబాద్‌లో జన్మించింది. ఇక్కడి సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదివింది. 1983లో ముంబైలో సెయింట్ జేవియర్స్ కాలేజీలో రెండేళ్లు చదువుకుంది. 

కెరీర్ ప్రారంభమైందిలా 

టబు పదిహేనేళ్ల వయసులో హమ్ నౌ జవాన్ (1985) చిత్రంతో బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె దేవ్ ఆనంద్ కూతురిగా నటించింది. ‘విజయపథ్’ (1994)లో అజయ్ దేవగన్‌కు జోడీగా నటించగా, ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఇందులో నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డును అందుకుంది.

1996లో టబు సినిమాలు ఏకబిగిన ఎనిమిది విడుదలయ్యాయి. ఆమె నటించిన ‘మాచిస్’ చిత్రం ఉత్తమ నటిగా మొదటి జాతీయ చలన చిత్ర అవార్డును తెచ్చిపెట్టింది. 2001లో మధుర్ భండార్కర్ దర్శకత్వంలోని ‘చాందినీ బార్’లో బార్ డ్యాన్సర్ పాత్రకు ఉత్తమ నటిగా రెండో జాతీయ చలనచిత్ర అవార్డు దక్కింది.

‘చీనీ కమ్’లో టబు 64 ఏళ్ల వృద్ధుడి (అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర)తో ప్రేమలో పడే 34 ఏళ్ల మహిళగా నటించింది. తాజాగా ఆమె నటించిన ‘ఔరో మే కహా దమ్ థా’ చిత్రం ఆగస్టులో విడుదలైంది. ఇంకా ఆమె పలు హిందీ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.  

‘కూలీ నెం.1’తో టాలీవుడ్‌కు పరిచయం 

‘కూలీ నెం.1’ చిత్రంతో తెలుగులో చాన్స్ కొట్టేసిన టబు.. అతితక్కువ కాలంలోనే టాలీవుడ్‌లోని ప్రముఖ హీరోల సరసన ఆడిపాడింది. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణలకు జోడీగా నటించింది. నాగార్జునతో ‘నిన్నే పెళ్లడతా’, ‘ఆవిడ మా ఆవిడ’ లాంటి సినిమాల్లో నటించి తనదైన నటనతో తెలుగులో స్టార్‌డమ్ సొంతం చేసుకుంది.

బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి’, ‘పాండురంగడు’లో నటించింది. ‘ప్రేమదేశం’ ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఫిల్మ్. ‘అలవైకుంఠపురం’లో అల్లు అర్జున్‌కు తల్లి పాత్రలో నటించింది. ‘దృశ్యం 2’, ‘నూటబల్ బాయ్’ వంటి సినిమాల్లోనూ నటించింది.