calender_icon.png 23 September, 2024 | 4:49 AM

రాజీనామా కాదు.. రాజకీయ సన్యాసం చేస్తా

23-09-2024 02:42:26 AM

అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని నిరూపించండి 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్ అవినీతిపైనా సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): అమృత్ టెండర్లలో అవినీతి కుంభకోణం జరగలేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నానని, చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే దగ్గరకు వెళ్దామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్న ట్లు కనిపించిందని, ఆయన రాజీనామా చేయాల్సిన అవస రం లేదని, రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాజీనామా చేయాల్సిన దగుల్బాజీలు ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రులేనని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్ర మే కాదు చుట్టరీకాలు కూడా తెలిసినట్టు లేదని ఎద్దేవాచేశారు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటికే తెలియాలని అన్నారు.

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్‌తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా తాను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాల మీద మీడియా సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. రూ.1,137 కోట్ల అవినీతి జరిగినా, ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం తెలుసు కోవాలని హితవు పలికారు. గతంలో ఉన్న దస్త్రాలతోపాటు ఇప్పుడు జరిగిన టెండర్ల వ్యవహారం పైనా వివరాలు ఉంచుదామని, న్యా యంగా తీర్పు చెప్పిన తర్వాత నేను చెప్పింది అబద్ధమంటే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తానని పునరుద్ఘాటించారు.

లేదంటే కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ మరేదైనా ఏజెన్సీ దగ్గరకైనా వెళ్దామని సూచించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌కు, మంత్రి పొంగులేటికి తెలుసన్నారు. ఆశ్రిత పక్షపాతం లేకుండా బంధువుల కు అక్రమంగా లాభం చేయను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్.. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేవలం రూ. ౨ కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1,000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరు నమ్మరని అన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఈ బరితెగింపు మాటలు మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. 

సీఎం సతీమణికి స్వయానా సోదరుడు

సీఎం సతీమణికి సూదిని సృజన్‌రెడ్డి బంధువు కాదని ఆమెకు స్వయానా సోదరుడని కేటీఆర్ స్పష్టంచేశారు. కేవలం అవినీతి నేపథ్యంలో  సొంత బావమరిదితో సంబం ధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పొంగులేటికి దమ్ముంటే విచారణ సంస్థల ముందుకు కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు రావాలని కోరారు. ఇప్పటికైనా జరిగిన తప్పును ఒప్పుకొని రేవంత్‌రెడ్డి.. టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాం డ్ చేశారు. లేకుంటే గతంలో సోనియా గాంధీ, అశోక్ చవాన్, యడ్యూరప్ప పదవులు పోయినట్టు ఆయన పదవీ పోవడం ఖాయమని అన్నారు. త్వరలో పొంగులేటి సంస్థకు దక్కిన కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టుల గురించి మాట్లాడుతానని స్పష్టంచేశారు.

ఢిల్లీకి కప్పం కట్టేందుకు సీఎం బావమరిదికి టెండ ర్లు, మంత్రికి టెండర్లు ఇస్తూ ప్రభుత్వం అవినీతికి తెగబడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వ్యవహారాలకు సంబంధించిన అంశంలో కేంద్ర మం త్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నుంచి మొదలుకొని ఒక్క ఎంపీ కూడా మాట్లాడక పోవ టం.. వారి వైఖరి ఏమిటో ప్రజలకు అర్థమైతుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి సోదరుడు అనుముల జగదీశ్‌రెడ్డి, బావమరిది సృజన్‌రెడ్డి వెయ్యి కోట్ల రూపాయలు పెట్టే స్థాయికి ఎట్ల ఎదిగారో రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో జరుగుతున్న ప్రతి అవినీతిపైన తమ దగ్గర పూర్తి సమాచారం ఉంద ని, అవినీతిని వరుసగా బయటపెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం న్యాయస్థానాలనూ తప్పు దోవ పట్టిస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పాలనలో చెలరేగిపోతున్న లంచావతారులు 

కాంగ్రెస్ అధికారం చేపట్టగానే కొం దరు లంచావతారులు చెలరేగి పోతున్నారని కేటీఆర్ విమర్శించారు. వివిధ శాఖలో పైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని, సాక్షాత్తూ రేవంత్‌రెడ్డి వద్దే ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెఎండీఏలో భారీ ఎత్తున పేరుకుపోతున్న ఫైళ్లు దేనికి సంకేతమని ప్రశ్నించారు. కారణాలు లేకుండా ఫైళ్లను తమవద్దే ఎందుకు అధికారులు తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు.

అనుమతుల్లో అవినీతి నిరోధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీఎస్-బీపాస్ తెచ్చిందన్నారు. అంతటి పారదర్శక విధానాన్ని కూడా రేవంత్ సర్కారు తుంగలో తొక్కి విచ్చలవిడి అవినీతి ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలకు అమ్యామ్యాల కోసమే సామాన్య ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతుందని మండిపడ్డారు.

సింగరేణి కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు బోగస్

  1. పండుగవేళ ప్రభుత్వం కార్మికుల పొట్టకొడుతోంది 
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది దసరా బోనస్ కాదని, బోగస్ అనిబీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. పండుగ వేళ రేవంత్ సర్కార్ కార్మికుల పొట్ట కొడుతోందని, లాభాల బోనస్ అంతా బోగస్‌గా మారిందని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో సింగరేణి ఏరియా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సింగరేణి కార్మికుడు కనీసం రూ.౧.80 లక్షలు నష్టపోతున్నాడని అన్నారు.

సింగరేణి నికర లాభం రూ.4,701 కోట్లలో 33 శాతం వాటా కింద 1,551 కోట్లు రావాలని.. ప్రతి కార్మికుడికి రూ.3.70 లక్షలు రావాలని చెప్పారు. కానీ, కేవలం రూ.796 కోట్లు మాత్రమే కార్మికులకు పంచుతున్నారని ధ్వజమెత్తారు. ఇస్తే మొత్తంగా లాభాలలో వాటా ఇవ్వాలి, లేకపోతే తామూ ఇచ్చేది కేవలం 16.9 శాతం మాత్రమేనని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. 33 శాతం అంటూ కార్మి కుల లాభాల వాటాపై అసత్యాలు చెప్పవద్దని సూచించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో లాభాలవాటా రూపంలో కార్మికులకు రూ.2,780 కోట్లు అందించిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తం పదేళ్లలో కార్మికులకు లాభాల వాటా రూపంలో దక్కి ంది కేవలం రూ.365 కోట్లు మాత్రమేనని ఆరోపించారు. తాము అధికారంలో వచ్చే నాటికి రూ.17వేల లాభాల వాటా ఉంటే, అధికారంలోకి దిగిపోయి నాటికి రూ.౧.౭౦ లక్షల వరకు ప్రతి కార్మికుడికి లాభాల వాటా ఇచ్చామని గుర్తుచేశారు. సింగరేణి ప్రాంతంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కార్మిక లోకానికి ఆ పార్టీ ఇచ్చిన బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని ముందే హెచ్చరించామని అన్నారు.

బీజేపీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేలంలో నవ్వుతూ పాల్గొన్నారని గుర్తుచేశారు. సింగరేణి లాభాల వాటాపై సింగరేణి కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలని సూచించారు. సింగరేణి ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికార గుర్తింపు సంఘంతోపాటు, కూనంనేని సాం బశివరావు, బీజేపీ నేతలు కూడా ఈ అంశంలో స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.