calender_icon.png 6 October, 2024 | 8:03 AM

సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం అమానుషం

11-09-2024 01:09:32 AM

వైద్య విధాన పరిషత్ తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం  

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖానల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అమానుషమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్టు చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వీరి బాధలు కనిపించకపోవడం శోచనీయమన్నారు.

విష జ్వరాలు విజృంభించి రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్న సమయంలో, ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. నిధులు విడుదల చేయకుండా చో ద్యం చూడటం సరికాదనానరు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించ కపోవడం ఆసుపత్రి సిబ్బందికి శాపంగా మారిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, టీవీవీపీ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు.