- పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
- సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): గుట్టలను మట్టి చేసి భూదాహ తీర్చుకోవడం మాని, గుట్టల్లా పేరుకపోయిన ధాన్యం రాశుల వైపు సీఎం రేవంత్ చూడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గాలి మోటార్లో మూటలు మోసుడు కాదు, కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడాలన్నారు.
బుధవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదని, పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం చూడాలని పేర్కొన్నారు. కల్లిబొల్లిమాటలతో కాలయాపన చేయవద్దని, ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర సంగతి ఎంటో తేల్చాలని సూచించారు.
మూసీకి ముసుగులు కాదు, కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో, ధాన్యం కొనుగోలు చేయాలని మొత్తుకుంటున్న రైతుల ఆవేదన ఆలకించాలని పేర్కొన్నారు. నీ కాసుల కక్కుర్తి, నీ కేసుల కుట్రలు కాదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక రైతులు గోస పడుతున్నారని తెలిపారు. దొడ్డు వరికి బోనస్ ఎగనామం పెట్టి సన్నవడ్లకు సున్న పెడితివి, ఎగొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలిచేందుకు లేదని విమర్శించారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఉత్సవాలకు..
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఈనెల 9న నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఏర్పడిన అసోసియేషన్ ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈఏడాది కూడా ఘనంగా నిర్వ హిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. తిరుపతి తెలిపారు. వీరితోపాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బాల్క సుమన్, పార్టీ ప్రతినిధులు హాజరైతారని వెల్లడించారు.