09-03-2025 12:00:00 AM
లైఫ్ పార్ట్‌నర్‌పై ప్రేమను తెలియజేసేందుకు చిన్నచిన్న కానుకలు ఇవ్వడం, అప్పుడప్పుడు ప్రశంసించడం మాత్రమే సరిపోవు. వాటితో కాస్త ఓపిక, సర్దుబాటు, ఆప్యాయత కూడా అవసరమే. అందుకోసం ఏం చేయాలంటే.. అన్నీ మనకు నచ్చినట్లే ఉండాలంటే కుదరదు. అలాగని ఎదుటివారికోసం మీకు నచ్చేవి కొన్ని వదులుకోవాల్సిన అవసరమూ లేదు.
ఆత్మాభిమానం దెబ్బతినకుండా, మొహమాట పడకుండా, సున్నితంగానే అభిప్రాయాల్ని చెప్పండి. ఎదుటివారి అభిప్రాయాలను, ఇష్టాలను కూడా గౌరవించండి. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా జీవితాన్ని హాయిగా నెట్టుకొచ్చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు సహజమే. అయితే, అలాంటప్పుడు ఎదుటివారిని అపహాస్యం చేయడం, చులకనగా మాట్లాడటం, తప్పులు ఎత్తి చూపుతూ వారినే కాకుండా..
వెనుక వారి తల్లిదండ్రులను, స్నేహితులను ప్రస్తావించడం వంటి పనులు అస్సలు చేయొద్దు. ఇవి వారి అహాన్ని దెబ్బతీస్తాయి. సమస్యను మరింత ముదిరేలా చేస్తాయి. గొడవ ఏదైనా సరే ఆ విషయాన్ని అక్కడితో పరిష్కరించుకుంటే సరి. ఇద్దరు ఆప్యాయంగా ఉంటేనే బంధం మరింత బలపడుతుంది.