పోలీసుల కేసును కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండా నడుపుతుండటం మోసం (చీటింగ్) పరిధిలోకి రాదని హైకోర్టు తీర్పు చెప్పింది. నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం ఐపీసీలోని 420 కింద నేరంగా పరిగణిం చడాన్ని తప్పుపట్టింది. నంబర్ ప్లేట్ లేకుం డా వాహనం నడుపుతున్న వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420, మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 80 (ఎ) కింద పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కే సుజన ఇటీవల తీర్పును వెలువ రించారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడుపుతున్నారన్న కారణంగా చార్మినార్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆర్ వసుంధరాచారి పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫున అడ్వొకేట్ ఆకాశ్ బాగ్లేకర్ వాదించారు. గుల్జార్‌హౌస్ రోడ్డులో త్రి, ద్విచక్ర వాహ నాలను తనిఖీ చేస్తుండగా పిటిషనర్ వాహ నానికి నంబర్ ప్లేట్ లేదని చెప్పి పోలీసులు పిటిషనర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారని తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 80(ఎ) కింద కేసు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమని వాదించారు.
ఆ సెక్షన్ల కింద పిటిషనర్ ఎలాంటి నేరాలకు పాల్పడలేదని తెలిపారు. పిటిషనర్ వాదనలతో ఏకీభ వించిన ధర్మాసనం నంబరు ప్లేట్ లేనప్పు డు పోలీసులు జరిమానా విధించవచ్చని చెప్పింది. లేదంటే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చనని పేర్కొంది. అంతేగానీ, మోసం చేశారన్న అభియోగంపై కేసు నమోదు చేయడం చెల్లదని తీర్పు చెప్పింది. కేసును కొట్టివేసింది.
నోటీసులిచ్చాకే దర్యాప్తు చేయాలి
హైడ్రా ఫిర్యాదుపై కేసులో హైకోర్టుకు ప్రభుత్వ ఉద్యోగులు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): చెరువుల ఆక్రమణలకు సహకరించారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసుల్లో నిందితులకు నోటీసులు జారీచేసి, వారి నుంచి వివరణ తీసుకున్నాకే చట్ట ప్రకారం దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణలను ప్రోత్సహించారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు ఆగస్టు 30న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి సర్వే విభాగానికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కే శ్రీనివాసులు, మరో ప్రభుత్వ ఉద్యోగి పూల్‌సింగ్ వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశారు.
వీటిని ఇటీవల జస్టిస్ కే సుజన విచారించారు. పిటిషనర్లపై నమోదైన అభియోగాలన్నీ ఏడు ఏండ్లలోపు శిక్షలు పడేవని, కాబట్టి ఆర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 35(3) (గతంలో సీఆర్పీసీ 41ఎ) ప్రకారం నోటీసులు జారీచేసి దర్యాప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు దర్యాప్తు అధికారులకు సహకరించాలని, అవసరమైనపుడు నిబంధనల ప్రకారం అడిగిన పత్రాలను సమర్పించాలని షరతు విధించింది. నిందితులైన పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని మేజిస్ట్రేట్‌కు సమర్పించే తుది నివేదికతో జత చేయాలని ఆదేశించింది. పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ప్రకటించింది.