- దళిత మహిళను అమానవీయంగా కొట్టారు
- ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
- పోలీసులకు ఇంత పొగరు ఎలా వచ్చింది : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫైర్
- బాధితురాలిని ఆసుపత్రిలో పరామర్శించిన నాయకులు
రంగారెడ్డి, ఆగస్టు 5 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసులు ఉండరని.. లాఠీ పోలీసులు మాత్రమే ఉంటారని చెప్పిన మాటలను షాద్‌నగర్ పోలీసులు నిజం చేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. షాద్‌నగర్ పోలీసుల చేతిలో థర్డ్ డిగ్రీకి గురై ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు సునీతను సోమవారం స్థానిక ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభివాణి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథం తదితరులతో కలిసి సోమవారం సబితారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ తరఫున తక్షణ సాయం కింద బాధితురాలకి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి రూ.లక్ష అందజేశారు. అనంతరం సబితారెడ్డి మాట్లాడుతూ.. ఒక దళిత మహిళ అని చూడకుండా అమానవీయంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్స్‌గ్రేషియా అందించాలి..
హైదరాబాద్, ఆగస్టు 5 : దళిత మహిళ సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బాధితురాలికి అత్యాధునికి వైద్యం అందించడంతో పాటు ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ పాలనంటే ఇదేనా: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): దళిత మహిళ సునీతపై షాద్‌నగర్ పోలీసులు జరిపిన దాష్టీకాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఇందిరమ్మ పాలనంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు ఎక్కువైపోయాని ఆవేదన వ్యక్తం చేశారు. సునీతపై దాడికి పాల్పడిన పోలీసులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.