పార్టీలకతీతంగా మల్కాజిగిరి అభివృద్ధి జరగాలి
పీర్జాదిగూడ మేయర్, పాలకసభ్యులతో ఎంపీ ఈటల
మేడిపల్లి, జూన్ 29 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పార్టీలకతీతంగా మల్కాజిగిరి అభివృద్ధి కి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. శనివారం పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఈటల రాజేందర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. త్వరలో జరగనున్న పీర్జాదిగూడ కౌన్సిల్ మీటింగ్‌కు ఆహ్వానం పలికారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినందుకు ఈటలను అభినందించారు. ఈ సందర్భంగా ఈటల వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అభివృద్దిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని విమర్శించారు. సంక్షేమానికి కృషి చేయడం ద్వారానే పాలకులు ప్రజల మన్ననలు పొందుతారని హితవు పలికారు.
సమస్యలపై ఈటలకు వినతి
పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని పలు సమస్యలపై మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈటలకు వినతిపత్రం అందించారు. ఉప్పల్ నుంచి సీపీఆర్‌ఐ రోడ్డు వరకు ఆరు లేన్ల రోడ్డు విస్తరణ, పీర్జాదిగూడ పర్వతాపూర్ నాలుగు లేన్ల విస్తరణ, రూ.110 కోట్లతో పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్ట్రాం వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను, తాగునీటి సమస్యలను ఈటల దృష్టికి తీసుకెళ్లారు. జీవో నంబర్ 118లోని పర్వాతపూర్ సలార్జాంగ్ కంచెలో (సీలింగ్ ల్యాండ్) ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన వారి గురించి ఈటలకు వివరించారు. ఈ మేరకు ఈటల వెంటనే ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.
ఉప్పల్ సీపీఆర్‌ఐ వరకు ఆరు లేన్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర సమస్యలపై త్వరలో సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో మాట్లాడి మున్సిపల్ పరిధిలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈటలను కలిసిన వారిలో నాగారం చైర్మన్ చంద్రారెడ్డి, కార్పొరేటర్లు బచ్చ రాజు, మద్ది యుగేందర్ రెడ్డి, కౌడే పోచయ్య, మధుసూధన్ రెడ్డి, ఏంపల్ల అనంత రెడ్డి, బీఆర్‌ఎస్ పీర్జాదిగూడ కార్పొరేషన్ అధ్యక్షులు బండారి రవీందర్, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, అలవాల దేవేందర్ గౌడ్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.