వినోద్ కిషన్ కృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పేకమేడలు’. ‘నాపేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ తెలుగులో తొలిసారి ‘పేకమేడలు’ ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నా రు. రాకేశ్ వర్రే దీనికి నిర్మాత. ఈ నెల 19న ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నీలగిరి మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకు దగ్గరగా ఈ సినిమాను చూపిస్తున్నాం.
కుటుంబ భావోద్వేగాలు, వినోదాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. ఈ సినిమాలో వినోద్ కిషన్ లక్ష్మణ్ అనే కుటుంబ బాధ్యత లేని వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయనకు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే ప్రసక్తే లేదు.. అందుకే అతన్ని లత్కోర్ లచ్చన్న అంటూ అందరూ ఈసడించుకుంటారు. దిగువ మధ్యతరగతిలో ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్లను చాలా మందిని నేను చూశాను.. ఆ పాయింట్‌తో రాసుకున్న ఈ కథ ద్వారా పురుషులందరూ లత్కోర్ లచ్చన్నలు కావొద్దని చెప్పదలుచుకున్నాం’ అని వివరించారు. నిర్మాత రాకేశ్ మాట్లాడుతూ.. ‘క్యూఆర్ కోడ్ స్కాన్‌తో మేము ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం.. విజయవంతమైంది.
సినిమా విడుదలయ్యే వరకు ఇలాగే వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాం’ అన్నారు. ఇంకా ‘ఇది ఒక కామెడీ సినిమా మాత్రమే కాదు.. ఆడవారు మగవారికి ఇస్తున్న సపోర్ట్ గురించి ఒక కోర్ పాయింట్‌తో మంచి కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తీశాం’ అని చెప్పారు. ‘తెలుగులో హీరోగా ఇది నా మొదటి సినిమా. నన్ను ఎంపిక చేసుకున్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని హీరో వినోద్ కిషన్ తెలిపారు. హీరోయిన్ అనూష కృష్ణ మాట్లాడుతూ.. మీడియా వ్యక్తుల చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. రితిక శ్రీనివాస్, జగన్ యోగిరాజ్, అనూష నూతల, గణేశ్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతం: స్మరణ్ సాయి; డీవోపీ: హరిచరణ్ కె.