calender_icon.png 2 April, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క అంగుళం కూడా హెచ్‌సీయూది కాదు ఆ భూమి మాదే!

01-04-2025 01:13:08 AM

  1. కంచె గచ్చిబౌలి భూమి మాదేనని సుప్రీంకోర్టే తేల్చింది 
  2. ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిపై 21 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత దక్కించుకున్నాం..
  3. ఆ భూమిలో చెరువులు లేవు..
  4. అభివృద్ధి పనులు అక్కడున్న రాళ్లను దెబ్బతీయవు
  5. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ 

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై యాజమాన్యహక్కులు తమవేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ర్ట ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూమిని కేటాయించింది..

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా తెలంగాణలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమి పై యాజమాన్యాన్ని దక్కించుకున్నది. ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(హెచ్‌సీయూ)ది కాదు”అని తెలంగాణ ప్రభు త్వం తేల్చేసింది.

ఈ మేరకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఈ భూమిలో ప్రభుత్వం చేప ట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు లేదు. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుత ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించే వారంతా కొందరు రాజకీయనాయకులు, స్థిరాస్తి వ్యాపారుల (రియల్ ఎస్టేట్) ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు.’ అని టీజీఐఐసీ పేర్కొన్నది. 

చట్టపరమైన అంశాలు..

* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వేనంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004, జనవరి 13వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధికి ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు మెమో నంబర్ 39612/ ఏఎస్‌స్‌ఎన్ /వీ (2) 2003 ప్రకారం కేటాయించింది.

* ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవ డంతో 2006, నవంబరు 21న నాటి రాష్ర్ట ప్రభుత్వం జీవో నెం:111080/ ఎస్1/2003 ప్రకారం ఆ కేటాయింపును రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు దానిని కేటాయించింది.

* ఈ భూమి కేటాయింపులపై ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ గౌరవ హైకోర్టులో 2006లో రిట్ పిటిషన్ నంబర్ 24781/2006 దాఖలు చేసింది. ఈ న్యాయపోరాటం సుదీర్ఘ కాలం కొనసాగింది. రాష్ర్టంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈకేసులో (రిట్ పిటిషన్ నంబర్ 24781/2006) హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా 2024, మార్చి 7వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది.

* హైకోర్టు తీర్పును ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ గౌరవ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (సీ) నంబర్ 9265/2024 ద్వారా సవాల్ చేసింది. ఈ పిటిషన్‌కు వ్యతిరేకంగా రాష్ర్ట ప్రభుత్వం పోరాడింది. 2024, మే 3వ తేదీన సుప్రీంకోర్టు ఐఎంజీ అకడమీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది.

* టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు..శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలు కంచె అస్తబల్ పోరంబోకు సర్కారీ(అంటే..ప్రభుత్వ భూమి అని) అని నిర్ధారించారు. ఆక్రమణలకు గురికాకుండా తర్వాత అభివృద్ధి పనులకుగా నూ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు సూచించారు.

* 2022, సెప్టెంబరు 14న జారీ చేసిన జీవో ఎం.ఎస్.నంబర్ 571, రెవెన్యూ (అస్సున్--1) డిపార్ట్‌మెంట్ ప్రకారం భూ కేటాయింపులకు సంబంధించిన కొత్తవిధానం ఆధారంగా కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కొలిచి హక్కులు బదిలీ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం, ఐఅండ్‌సీ విభాగం 2024, జూన్ 19న సూచించింది.

* ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు తమకు ఆ 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసీ 2024, జూన్ 19న ప్రతి పాదనలు సమర్పించింది. ఆ భూమి ని స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ రెవెన్యూశా ఖ ముఖ్య కార్యదర్శి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి హక్కులను టీజీఐ ఐసీకి బదలాయిస్తూ 2024, జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచనామా నిర్వహించి 2024, జులై 1వ తేదీన టీజీఐఐసీకి అప్పగించారు. 

* ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. కొన్ని మీడియాల్లో తప్పుడుగా వస్తున్నట్లు అటవీ భూమిగా లేదని రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉందని స్పష్టమవుతోంది. 

హెచ్‌సీయూ అధికారుల సమన్వయంతోనే హద్దుల గుర్తింపు..

* తమకు కేటాయించిన 400 ఎకరాల భూమికి సంబంధించిన ఉమ్మడి హద్దుల గుర్తింపునకు తమ అధికారులకు సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ సైబరాబాద్ జోనల్ మేనేజర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్‌కు 2024, జూలై 4వ తేదీన లేఖ రాశారు. టీజీఐఐసీ అధికారులు తమ బృందంతో పాటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్‌ను 2024, జూలై 7వ తేదీన వ్యక్తిగతంగా కలిసి తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను ఆయనకు వివరించారు. సర్వే నిర్వహణ విషయంపై టీజీఐఐసీ జోనల్ మేనేజర్ 2024, జూలై 18న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్‌కు మెయిల్ చేశారు.

* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024, జూలై 19న యూనివర్సిటీ అధికారులు యూనివర్సి టీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజినీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రె వెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే జరిగింది. అదే రోజు హద్దులు నిర్ధారించారు.

* 400 ఎకరాల్లో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. 

 రాళ్ల అమరిక, చెరువుల (లేక్స్) పరిరక్షణ..

* అక్కడ చేసిన సర్వేను పరిశీలించిన టీజీఐఐసీ తాము చేసే లేఅవుట్‌లో మష్‌రూమ్ రాక్స్‌తో పాటు ఇతర రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్)ను హరిత స్థలాలుగా (గ్రీన్ స్పేస్) పరిరక్షించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ తర్వాత మాస్టర్‌ప్లాన్‌లో ఆ ప్రాంతంలో సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక (ఈఎంపీ) తయారుచేయాలని నిశ్చయించింది.

* వీటన్నింటిని గమనిస్తే టీజీఐఐసీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు ఆక్రమించలేదని, ఇప్పుడు ఉన్న జల వనరులు (లేక్స్), రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్)ను దెబ్బతీయడం లేదని స్పష్టమవుతోంది. 

* ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని మాస్టర్‌ప్లాన్ ప్రకారం సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు 2025, ఫిబ్రవరి 28న టీజీఐఐసీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ 

హద్దులు నిర్ధారించలేదు 

హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ప్రకటన విడుదల 

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో కీలక పరిణామం చో టుచేసుకున్నది. ఆ భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ చేసిన ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఖండించింది. ఈ మేరకు హెచ్‌సీయూ రిజిస్ట్రార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

టీజీఐఐసీకి కేటాయించిన స్థలం యాజమాన్యం, యూనివర్సిటీ భూముల హద్దుల నిర్ధారణ విష యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఖం డించింది. 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు యూనివర్సిటీ క్యాంపస్‌లో రెవె న్యూ అధికారులు జూలై 2024న ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

హెచ్‌సీ యూ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జూలై 19న యూనివర్సిటీ అధికారులు, రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజినీర్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పె క్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే నిర్వహించి అదేరోజున హద్దులు నిర్ధారించినట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనను హెచ్ సీయూ రిజిస్ట్రార్ తోసిపుచ్చారు.

‘ఇప్పటివరకు కేవలం భూమి ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగిందని, ఇటీవల టీజీఐఐసీ ఇచ్చిన మీడియా ప్రకటనను కూడా యూనివర్సిటీ ఖండించినట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నా రు. యూనివర్సిటీకి కేటాయించిన భూమి ఏదైనా బదిలీ జరగాలంటే అది యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి అధికారిక సమ్మతితోనే జరుగుతుందని తెలిపారు.

ఈ విషయంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్టేక్ హోల్డర్స్, మీడియా ప్రతినిధులు యూ నివర్సిటీ ధ్రువీకరించని ఏ అంశాన్ని ప్రచా రం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.