calender_icon.png 25 October, 2024 | 4:56 AM

మా వల్ల కాదంటే కాదు

25-10-2024 01:36:06 AM

  1. సన్న ధాన్యం మిల్లింగ్‌కు ససేమిరా అంటున్న మిల్లర్లు
  2. క్వింటాల్‌కు 67 శాతం బియ్యం ఇవ్వలేమని వెల్లడి
  3. తేమ శాతం 17 నుంచి 14కు తగ్గించాలి
  4. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ధాన్యం తీసుకోం
  5. మిల్లర్ల మెలికతో ఆందోళనలో పౌరసరఫరాల అధికారులు

హైదరాబాద్/మెదక్, అక్టోబర్ 24 (విజయక్రాంతి):  సన్న ధాన్యం మిల్లింగ్ చేయడం తమతో కాదని రాష్ట్ర మిల్లర్లు తేల్చి చెబుతున్నారు. క్వింటా కు 67 శాతం బియ్యం ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సన్న ధాన్యాన్ని మిల్లింగ్‌కు తీసుకోబోమని అధికారుల ను హెచ్చరిస్తున్నారు.

తాము నష్టాలతో సీఎంఆర్ చేయలేమని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మిల్లింగ్ నిబంధనలు సడలించి క్వింటాకు కొంత పరిహారం, కస్టోడియ న్, మిల్లింగ్, రవాణా ఛార్జీలు పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల నాలుగైదు జిల్లా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానికి మం త్రులు ప్రారంభిస్తుండగా మిల్లర్ల మెలికతో సన్నధాన్యం సేకరణ సర్కార్‌కు కొత్త సమస్యగా మార నుంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజ న్ నుంచి ప్రభుత్వం కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ గోదాముల్లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో మిల్లర్ల అక్రమాలకు కళ్లెం పడనుంది. ఈ నిర్ణయంతో మిల్లర్లు తమ అక్రమ సంపాదనకు అడ్డుకట్టపడుతుందనే ఆలోచనతోనే మెలికలు పెడుతున్నట్లు పౌరసరఫరాల అధికారులు భావిస్తున్నారు.

బోనస్‌తో పెరిగిన సన్నవరి సాగు..

వానాకాలం సీజన్‌లో 60.39 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. 146.28 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనాకొచ్చారు. అందులో 91.28 లక్షల మెట్రిక్‌ట న్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 7,139 కేంద్రాలను ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

ఈసారి 31 రకాల సన్నధాన్యాన్ని పండిం చిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గతంలో ఎప్పడు పండించని విధంగా రైతులు వానాకాలం సీజన్‌లో అత్యధిక శాతం సన్నవరి పంట సాగు చేశారు. క్వింటాల్‌కు రూ. 2,320మద్దతు ధర చెల్లిసుండగా బోనస్‌తో కలిసి రూ. 2,820 చొప్పను కొనుగోలు చేయనుంది. 

57 కిలోల బియ్యం ఇస్తాం.. 

సాధారణంగా దొడ్డు రకం క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం వస్తాయి. అదే సన్నరకం ధాన్యం మిల్లింగ్ చేస్తే 57 కిలోలకు మించి బియ్యం రావని మిల్లర్లు అంటున్నారు. దొడ్డు, సన్నాలకు చెందిన ఏ రకం ధాన్యం మిల్లింగ్ చేసి నా క్వింటాకు రూ.67 కిలోల బియ్యం సీఎంఆర్ కింద అప్పగించాలని ప్రభుత్వం పేర్కొంటుంది.

సన్నరకాలను తీసుకొని మిల్లింగ్ చేస్తే క్వింటాకు 10 కిలోల బియ్యం తక్కువగా వస్తుందని, ఈ లోటును ఎవరు భరిస్తారని మిల్లర్లు ప్రశ్నిస్తున్నా రు. పైగా 17 శాతం తేమ ఉన్న సన్నరకం ధాన్యా న్ని దిగుమతి చేసుకుంటే 20 రోజుల్లో రంగు మారిపోయే ప్రమాదం ఉందని, ఇవే బియ్యాన్ని మిల్లింగ్ చేస్తే బియ్యం తీసుకునే సమయంలో నాణ్యత లేదంటూ అధికారులు కొర్రీలు పెడితే తాము నష్టపోతామని వాపోతున్నారు.

అదే విధం గా తేమ నిబంధనను 17 నుంచి 14 శాతానికి తగ్గించాలని, సన్న బియ్యం సరఫరాలో క్వింటాకు రూ.300 పరిహారం, రవాణా ఛార్జీలు పెంచాలని మిల్లర్లు కోరుతున్నారు. క్వింటాకు ఎన్ని కిలోల బియ్యం వచ్చినా తీసుకునేలా నిబంధనలు పెట్టాలని సూచిస్తున్నారు.

20 ఏళ్లుగా మిల్లింగ్ చార్జీలు పెంచకపోవడంతో అనేక సమస్యలు తమను వేధిస్తున్నాయని అంటున్నారు. రా రైస్ క్వింటాకు రూ.30 చెల్లిస్తున్నారని. పెరిగిన విద్యుత్ చార్జీలు, కార్మికుల కూలీ కలిపితే తమకు అసలే గిట్టుబాటు కావడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మెదక్ జిల్లాలో మిల్లింగ్ ప్రశ్నార్థకం

మెదక్ జిల్లాలోసన్న ధాన్యం మిల్లింగ్‌కు  మిల్లర్లు  ససేమిరా అంటున్నారు. తమ సమస్య పరిష్కారం కానిదే ధాన్యాన్ని మిల్లింగ్‌కు తీసుకోబోమని స్పష్టం చేస్తున్నారు. మిల్లర్ల మెలికతో సన్నధాన్యం సేకరణ చిక్కు సమస్యగా మారనుంది. జిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతులు 2.97 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందు లో సన్న రకం సాగు 1,04,970 ఎకరాలు, దొడ్డురకం 1,92,365 ఎకరాల్లో సాగయింది.

కాగా సన్నరకం 2,30,964 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 5,19,000 మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. ఈసారి సన్నరకం వరి ఎక్కువ మంది రైతులు సాగు చేశారు. వచ్చే దిగుబడి అంచనాలను బట్టి జిల్లాలో 497 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో నవంబర్ మొదటి వారం నుంచి వరికోతలు మొదలవుతాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశారు.

సన్నాలకు కేంద్రం క్వింటాలుకు రూ.2,320 మద్దతు ధర చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ కలిపి రూ.2,820 చొప్పును కొనుగోలు చేయనుంది. దొడ్డు బియ్యం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు వెళ్తా యి. కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్న ధాన్యా న్ని మిల్లింగ్ చేశాక వచ్చే బియ్యాన్ని వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు, సంక్షేమ వసతి గృహాలకు ఉపయోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

కానీ సన్న ధాన్యం మిల్లింగ్‌కు మిల్లర్లు ససేమిరా అనడంతో ఈ సమస్య కొలిక్కి వచ్చిన తర్వాతే సన్న ధాన్యం కొనుగోలు చేయాలని ఆలోచనలలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలు సడలించాలని రా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేశం తదితరులు కోరుతున్నారు.