calender_icon.png 19 November, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బండి’ కాదు, జగమొండి!

29-06-2024 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

లోకంలో మిత్రులు రకరకాలుగా వుంటారు. కొందరు నిజాయితీగా వ్యవహరిస్తే, మరికొందరు వెనుకనుంచి గోతులు తీస్తారు. సహజ శత్రువులకంటే నటించే మిత్రులవల్ల మహాప్రమాదం. అందుకే, వేదం “అభయం మిత్రాత్‌” అంది. అంటే, మిత్రులవల్ల భయం లేకుండా ఉంచమని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి” అన్నది ఉద్బోధ. ఇది అనుభవంలోకి వస్తేకానీ నాకు తెలిసిరాలేదు.

‘పాత స్కూటర్ కొనకండి, కొత్త స్కూటరే కొనండి’ అని పదే పదే నా అర్థాంగి చెబుతూనే వుంది. కానీ, నేను వింటేనా? ఆమె మాటలు పెడచెవిన పెట్టడం వల్ల కష్టాలను కొనితెచ్చుకున్నా ను. ఈ తరహా అనుభవాలు చాలామందికి ఎదురుకావచ్చు. కానీ, దీనికి లభించిన ముగింపే నేనెప్పటికీ మరిచిపోలేను. అది నిజంగానే నా పాలిట బండి కాదు, జగమొండి! లోకంలో మిత్రులు రకరకాలుగా వుంటారు. కొందరు నిజాయితీగా వ్యవహరిస్తే, మరికొందరు వెనుకనుంచి గోతులు తీస్తారు. సహజ శత్రువులకంటే నటించే మిత్రులవల్ల మహాప్రమాదం. అందుకే, వేదం “అభయం మిత్రాత్‌” అంది. అంటే, మిత్రులవల్ల భయం లేకుండా ఉంచమని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి” అన్నది ఉద్బోధ. ఇది అనుభవంలోకి వస్తేకానీ నాకు తెలిసిరాలేదు.

అతని పేరు స్వామి. నాకు ఎంఏ క్లాస్‌మేట్. ఒకే బస్తీలో వుండడం వల్ల మా పరివారాలు కూడా సన్నిహితమయ్యాయి. తాను నాకంటే ముందు స్కూటర్ కొన్నా డు. డ్రైవింగ్ వచ్చినవాడు కనుక, నన్ను వెనక ఎక్కించుకొని యూనివర్సిటీ రోడ్డుమీద నడిపించాడు. అతడు కొత్తగా స్కూట ర్ కొన్నాడు కాని, ఆ స్కూటర్ ‘కొత్తదా, పాతదా?’ అని నేను అడగలేదు, అతను చెప్పలేదు. మొత్తం మీద అతని స్కూటర్ ఎక్కి పోతుంటే, గాలిలో దూసుకుపోతున్న అనుభూతి కలిగింది. ఇంటికి వచ్చిన తర్వా త “స్వామీ! నాకు కూడా స్కూటర్ కొనిపెట్టరాదా?” అన్నాను. అతడు వెంటనే “నీకు నచ్చితే ఈ స్కూటర్ తీసుకో. ఇది ప్రియా బండి. చాలా బాగుంది. చూశావు గదా?” అన్నాడు. “వద్దులే, నాకు వేరే ఇప్పించు” అన్నాను. దానికి స్వామి, “నేను వేరే కలర్ బండి కొనుక్కుంటాను. నేను కొన్నదానికంటే రెండు వేలు తక్కువ కిస్తాను” అని ఆశ చూపెట్టాడు. నేను “సరే” అని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. కాగితాలు కూడా వేగంగానే వచ్చాయి. తెలియక చేసి న ఈ తప్పు నన్ను కొన్నాళ్లపాటు ముప్పు తిప్పలు పెట్టింది. ఒక స్థితిలో ప్రాణం మీదికి కూడా వచ్చింది.

నాలుగు రోజులు కష్టపడి బండి నడపడం నేర్చుకున్నాను. పదిహేను రోజులు గడచిన తర్వాత ఒకరోజు రోడ్డుమీదికి వెళ్లి వస్తుంటే, ఉన్నట్టుండి బండి శబ్దం చేస్తూ ఆగిపోయింది. ఏం చేస్తాం, తోసుకుంటూ దానిని దగ్గర్లోని మెకానిక్‌కు చూపించాను. ఆ మెకానిక్ శీను నాకు అంతకు ముందే తెలుసు. బండిని చూడగానే, “సార్! ఇదేం టి, ఈ బండి మీ దగ్గరికి వచ్చింది?” అన్నా డు. ఆ బండి గత చరిత్ర అతనికి తెలిసినట్లున్నది. “ఏం బాగా లేదా బండి?” అన్నా ను. “బాగుంటే రోడ్డుమీద ఎందుకు ఆగుతుంది?” అన్నాడు తిరిగి. నాకు కొంచెం అర్థమైంది. బండిలో ఏదో మోసం ఉంద ని. “ఈ బండి మన రాష్ట్రంది కాదు. మహారాష్ట్రది. స్వామి వదిలించుకున్నట్లే దీన్ని మీరు కూడా ఎలాగోలా త్వరగా వదిలించుకోండి” అని సలహా ఇచ్చాడు. తాత్కా లిక రిపేర్‌తో స్టార్ట్ చేసి పంపించాడు.

మెడకు పడ్డ పాము

ఆ రోజు రాత్రి నాకు నిద్ర లేదు. ‘బండి మంచిదైతే రోడ్డుమీద స్టార్ట్ కాకపోవడమేమిటి? కొనడానికి ముందు ఆ బండి గురించి ఎవరినైనా అడిగి వుండాల్సింది. ఏదేమైనా, దీన్ని శీను చెప్పినట్లే నేను కొన్న అతనికే దాన్ని అప్ప జెప్పాలి’ అనుకొన్నా ను. పొద్దున లేవగానే స్వామికి ఫోను చేసి, బండి ఆగిపోయిన విషయం చెప్పాను. “నాకీ బండి వద్దు” అన్నాను. దానికి స్వామి, “అయ్యో, నేను అప్పుడే కొత్త బండి కొన్నాను. ఇప్పుడెలా?... సరే, నేనే ఈ బండిని అమ్మిపిస్తాను” అన్నాడు. అన్న ట్టే, రెండ్రోజుల్లోనే ఓ కొత్త వ్యక్తిని మా ఇంటికి రప్పించాడు. “ఇది కొత్త బండి అనుకొని నేను నీకు రూ.12,000 ఇచ్చాను. ఎలాగైనా, నా డబ్బు నాకు తిరిగి వచ్చే లా చూడు” అన్నాను. గట్టిగా వారించలేకపోయా ను. కానీ, అందరూ నాలా అమాయకంగా ఉండరని నాకు మరి కొద్ది రోజుల్లోనే అర్థమైంది.

నా దగ్గరి బండి కొంటానని వచ్చిన ఆ కొత్త వ్యక్తి మా బస్తీలోనే ఉంటాడు. చూస్తే రౌడీవలె వున్నాడు. యూనివర్సిటీలో టెంపరరీ ఉద్యోగి. ఆశ్చర్యంగా నేనతనికి ఎన్ని వేలకు అమ్మాలో స్వామియే నిర్ణయించి నాకు చెప్పాడు. “అతను ఆరు వేలు మాత్రమే ఇస్తాట్ట. నీ కిష్టమేనా?” అని స్వామి అడిగేసరికి గతుక్కుమన్నాను. ఆరు వేలు సగానికి సగం నష్టం! కళ్లనీళ్ల పర్యం తం అయ్యాను. “బండి చేతులు మారితే ధరకూడా మారుతుంది. ఆరు వేలు తీసుకొని బండిని అప్పగించడమే మంచిది” అని నాకేదో లాభం కలిగించే వానిలాగా తొందర పెట్టాడు స్వామి. ‘ఈ బండిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదన్న’ శీను మాటలు నా బుర్రలో మెదిలాయి.

ఈ తతంగమంతా చూస్తుం టే బాగుండదని నా శ్రీమతి ప్రమీలను ఆమె పుట్టింటికి పంపించాను. ఆమె తల్లిగారు కవాడిగూడలో ఉంటుంది. అనుమా నంగానే వెళ్లింది మరి. ఆ కొత్త వ్యక్తి ఆరువేలకు నాకు చెక్కు ఇచ్చి బండి తీసుకొని వెళ్లాడు. నెల రోజులు గడిచాయి. సంతోషపడ్డాను. కానీ, ఒకరోజు ఆ వ్యక్తి మా ఇంటి ముందుకు వచ్చి బండి ఆపేశాడు. అతడు చిరాగ్గా అన్నాడు నాతో, “ఈ బండి పాత ది. నీది నువ్వే ఉంచుకో. ఆ స్వామి దీన్ని నాకంట గట్టాడు” అని వెళ్లిపోయాడు. నేను నోరు వెళ్లబెట్టాను. ఏమీ తోచక స్వామికి ఫోను చేశాను. స్వామిలోని మిత్రత్వం అంతటితో ముగిసింది. “అతడు ఇక్కడ ఒక రౌడీ. ఈ విషయం నాకూ ఈ మధ్యే తెలిసింది.

మీరు వెంటనే అతని చెక్కు అతనికి ఇచ్చేయండి” అని ఫోను పెట్టేశాడు. ‘రౌడీ’ అన్న మాట వినగానే నాకు నిజంగానే భయం వేసింది. తేరుకొని ఒక ఐదు వందలు పట్టుకొని, అయిదు వేల అయిదు వందలకు కొత్తగా చెక్కు రాసి అతనికి అందచేశాను. ఇంతటితో ‘పాత బండి సమస్య తీరకపోతే మానే, ఈ రౌడీ అధ్యాయం ముగిసింది’ అనుకున్నాను. కానీ, అసలు కథ అప్పుడే ఆరం భమైంది. పాత బండి సమస్య ముదిరి పాకాన పడింది. దారిన పోయే కంపను తగిలించుకున్నట్టయ్యింది.

ఓ వారం తర్వాత ఆ రౌడీ వెధవ మా ఇంటికి వచ్చాడు. “మిగిలిన నా ఐదు వందలు నాకివ్వు. లేకపోతే బాగుండదు. చంపేస్తా!” అన్నాడు గుడ్లురిమి చూస్తూ. ‘ఇదెక్కడి పంచాయితీయో’ నాకర్థం కాలే దు. ఆ స్వామి అనే మిత్రుని వల్ల ఆరు వేలు నష్టమైనా నేను ఊరుకున్నాను. కానీ, ఒక్క ఐదు వందలు తక్కువైనా అతగాడి మిత్రుడైన ఇతడు ఊరుకోవడం లేదు. నా మనస్సు ఎంతో ఆందోళనకు గురైంది. స్వామితో మాట్లాడినా లాభం లేకపోయిం ది. అతని 500 అతనికి ఇచ్చేయడం తప్ప నాకు మరో మార్గం కనిపించలేదు. కానీ, ఆ స్వామి అనే మిత్రుడు నాకు చేసిన మోసం? ఆ పాత జగమొండి బండిని ఎలా వదిలించుకున్నానో దేవుడికే తెలియాలి.

వ్యాసకర్త సెల్: 9885654381