- ప్రజలకు వివరించడంలో విఫలమవుతున్న అధికారులు
- ఇష్టారీతిగా మెడికల్ దుకాణాల నిర్వాహకుల తీరు
- రోగుల జేబులకు తప్పని చిల్లులు
వనపర్తి, నవంబర్ 1౪ ( విజయక్రాంతి) : తక్కువ ధరకు లభించే జెనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కొరవడింది. దీంతో రోగులు మెడికల్ షాపుల నిర్వాహకులు ఆడిందే ఆటగా మారింది. రోగులకు జెనరిక్ మందులనే రాయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినా కొందరు మాత్రమే పాటిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వనపర్తి జిల్లాలో దాదాపు 200లకు పైగా మెడికల్ రిటైల్, హోల్‌సెల్ దుకాణాలున్నాయి. కొందరు మెడికల్ షాపు యజమానులు బ్రాండ్ల పేరుతో జెనరిక్ మందులనే అధిక ధరకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ఆవరణలో మాత్రమే జెనరిక్ మందుల దుకాణాన్ని ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్నారు.
ప్రతి మెడికల్ దుకాణంలో వ్యాపారి విధిగా ఓ ఫార్మాసిస్టును నియమించుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ చాలా చోట్ల ఫార్మాసిస్టులు కనిపించే పరిస్థితి లేదు. ప్రధాన ఆసుపత్రిలో నడుస్తున్న మెడికల్ దుకాణాల్లో కొన్న మందులకు బిల్లులు ఇస్తున్నారు తప్ప.. మిగిలిన షాపుల్లో ఇవ్వడం లేదు. బిల్లులో తయారీ వరుస సంఖ్య, తయారీ తేదీ, కాల పరిమితి తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
జెనరిక్, బ్రాండెడ్ ఔషధాలు ఒకే ఫలితాన్ని ఇస్తున్నా.. వాటి ధరల్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. తక్కువ ధరకు లభించే మందులకు బదులు బ్రాండెడ్ పేరుతో జేబులకు చిల్లులు పడేలా చేస్తున్న మెడికల్ దుకాణాల నిర్వాహకుల తీరును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం..
కొన్ని బ్రాండ్ కంపెనీల పేర్లను అడ్డం పెట్టుకుని మెడికల్ షాపుల నిర్వాహకులు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జెనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పిం చడంలో ఔషధ నియంత్రణ శాఖ పూర్తిగా విఫలమైందనే విమర్శలొస్తున్నాయి. జెనరిక్ మందులు వాడితే ఎటువంటి ఉపయోగం ఉండదని కొందరు మెడికల్ షాపుల యజమానులు చేస్తున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే.. సంబం ధిత శాఖ అధికారులు ‘జెనరిక్’పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.