calender_icon.png 14 November, 2024 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్ట్ కాదు.. కిడ్నాప్!

14-11-2024 01:48:46 AM

  1. మఫ్టీలో వచ్చి తీసుకెళ్లడానికి నరేందర్‌రెడ్డి బందిపోటా?
  2. అల్లుడి కంపెనీ కోసమే సీఎం రేవంత్ భూసేకరణ
  3. కొడంగల్ నుంచే సీఎం భరతం పడతాం: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి): కొడంగల్‌లో రైతులు చేసిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కారణంగా చూపడం దారుణమని, నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు.. కిడ్నాప్ చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మఫ్టీలో వచ్చి తీసుకెళ్లడానికి నరేందర్‌రెడ్డి ఏమైనా బందిపోటా అని ప్రశ్నించారు. కొడంగల్ రైతుల సమస్యకు సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్టు అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు.

జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరి స్తూ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరా హయాంలోని ఎమర్జెన్సీ పాలన అని విమర్శించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీల బాగోతాన్ని ధారావాహికగా బయటపెడుతూనే ఉంటామని హెచ్చరించారు.

కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ రంగంలో లీడర్‌గా ఎదిగిందని, తెలంగాణను ఫార్మా రంగంలో రారాజు చేసేందుకు కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఫార్మాసిటీని ప్లాన్ చేశారని స్పష్టం చేశారు.

రాష్ట్రం ఏర్పడిన వెంటనే పంచాయితీలు పెట్టుకోకుండా తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వా నించాలని కేసీఆర్ సూచించినట్టు వెల్లడించా రు. ప్రపంచ తయారీ రంగంలో చైనా దేశం లీడర్‌గా ఎలా ఎదిగిందో పరిశీలించేందుకే కేసీఆర్ చైనా పర్యటించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఫార్మా పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు కూడా ఒకే చోట ఫార్మా కంపెనీలు పెట్టాలని కోరినట్టు స్పష్టం చేశారు.

ఇందు లో భాగంగా కేసీఆర్ ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాలు రాకుండా, 50 ఏళ్లపాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఫార్మాసిటీని డిజైన్ చేశారని చెప్పారు. దాదా పు 8 ఏళ్లు కష్టపడి 14 వేల ఎకరాల భూమి సేకరించామని తెలిపారు. అప్పుడు ఇదే సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఫార్మా సిటీ వస్తే మీ ప్రాంతం కాలుష్యం అవుతుందని ప్రజలను రెచ్చగొట్టారని గుర్తు చేశారు.

కానీ రేవంత్‌రెడ్డి సీఎం కాగానే తుగ్ల క్ మాదిరిగా ఫార్మాసిటీ రద్దు అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఫార్మాసిటీ పేరును ఫార్మా విలేజ్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫార్మాసిటీ పూర్తి చేద్దామని భావించామని, దీంతోపాటు భూములిచ్చిన రైతు లకు ప్లాట్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అలాంటి ఫార్మా సిటీని వది లి ఈ సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్, మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

అల్లుడి కోసమే..

దీని కారణంగానే ప్రజలు తిరగబడుతున్నారని, ప్రజల తిరుగుబాటులో ఎవరి కుట్ర లేదన్నారు. కొడంగల్‌లో ఫార్మా విలేజ్ విషయంలో ఆరు నెలల నుంచే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, భూములు ఇవ్వకుంటే తన్ని తీసుకుంటామని ప్రజలను సీఎం సోదరుడు బెదిరించారని పేర్కొన్నారు. ఫార్మా విలేజ్ వద్దని కొడంగల్ రైతులు తమతోపాటు సీఎం సోదరుడిని, బీజేపీ వాళ్లను కూడా కలిశారని తెలిపారు.

భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీల భూములను రేవంత్‌రెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆరోపించారు. ఆవేదనలో ఉన్న రైతులను అర్థరాత్రి లాక్కొని పోయి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇది పేదలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వమని అన్నారు.

రేవంత్‌రెడ్డి అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన మ్యాక్స్ బీఎన్ కంపెనీ విస్తరణ కోసమే రైతుల భూములను తీసుకుంటున్నారని ఆరోపించారు. మెడికవర్ హాస్పిటల్ యజమాని అన్నం శరత్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని తెలిపారు. వీరి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో అక్రమాలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 

కుంభకోణాలు బయట పెట్టేందుకే..

ఫార్ములా-ఈ రేస్ విషయంలో ఏమైనా చేసుకోండి అని, కేసు పెడితే పెట్టుకోమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని తెలిపారు. తాను ఢిల్లీకి వెళ్తే బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లినట్టు అయితే, గవర్నర్‌ను రేవంత్‌రెడ్డి కలిస్తే అది కాళ్ల బేరానికి వెళ్లినట్టు కాదా అని ప్రశ్నించారు. అదానీ కాళ్లు పట్టుకుని పొంగులేటి తన మీద ఈడీ కేసు కాకుండా చూసుకున్నారని ఆరోపించారు. అనుముల కుటుంబ కుంభకోణాలు బయట పెట్టేందుకే ఢిల్లీకి వెళ్లామని, ఇంకా చాలా కుంభకోణాలను బయటపెడతామని స్పష్టం చేశారు. 

భూములు పోతున్నా అడగొద్దా..

కొడంగల్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్త అయి న సురేష్‌కు చెందిన 7 ఎకరాల భూమి పోతుందని, విలువైన భూమి పోతుంటే అడగటం తప్పా అని ప్రశ్నించారు. సురేష్ ఎవరిపై దాడి చేయలేదని, కలెక్టర్ అభిప్రా య సేకరణకు వచ్చినప్పుడు రైతుల బాధలను సురేష్ వివరించారని తెలిపారు. సురే ష్ దాడి చేసినట్టు ఏమైనా ఆధారాలున్నా యా అని ప్రశ్నించారు.

మా పార్టీ నాయకులు మాతో మాట్లాడితే తప్పా.. దానికే కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పి గెలిచిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రశ్నిం చే వాళ్లను అరెస్ట్ చేయిస్తున్నారని, మీ అనాలోచిత విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.

సురేష్ తమను కలవడం తప్పు అయితే, రాహుల్ గాంధీ వ్యతిరేకించే అదానీతో రేవంత్‌రెడ్డి కలవడం కూడా తప్పే అన్నారు. మీ అనాలోచిత నిర్ణయాలను మానుకోవాలని, ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాం డ్ చేశారు. 

కొడంగల్ నుంచే సీఎం భరతం...

ఫార్మా సిటీ విషయంలో రేవంత్‌రెడ్డి హైకోర్టును కూడా మోసం చేస్తున్నారని, బయట ఫార్మా సిటీ రద్దు అని, కోర్డులో మాత్రం ఫార్మా సిటీ ఉందని చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ అంటూ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్‌రెడ్డి భరతం పట్టే పనిని కొడంగల్ నుంచే మొదలు పెడతామని, మా పార్టీ తరఫున కొడంగల్‌కు వెళ్తామని ప్రకటించారు. ఈ దుర్మార్గాలపై న్యాయ పోరా టం చేస్తామని, బాధిత రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన రైతులను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని, వారికి వెంటనే మెడికల్ ఎగ్జా మినేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమే..

ఈ తుగ్లక్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా అధికారులు బలి అవుతున్నారని, ప్రభుత్వం కుట్రలో అధికారులు బలి కావద్దని సూచించారు. కొడంగల్‌లో రైతులతో భూసేకరణ పంచాయితీ వచ్చినప్పుడు పిలిచి మాట్లాడని కుసంస్కార ప్రభుత్వం ఇదని ఎద్దేవా చేశారు. మా హయాంలో కూడా భూసేకరణ సమస్య లు వస్తే రైతులను మెప్పించి, ఒప్పించి మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు.

కానీ రేవంత్‌రెడ్డికి 9 నెలలుగా కొడంగల్‌లో ఆందోళన చేస్తున్న రైతుల ను కలిసే సమయం లేదన్నారు. కలెక్టరే స్వయంగా దాడి జరగలేదని చెబుతుం టే, ఐజీ మాత్రం దాడి జరిగిందనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది ముమ్మాటికీ ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని, ఆం దోళన జరుగుతున్న సమయంలో కలెక్టర్ సెక్యూరిటీ, పోలీసులు ఎక్కడు న్నారని ప్రశ్నించారు.

భూములు గుంజుకునేందుకు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి రియల్ ఎస్టే ట్ ఫార్ములా, ఢిల్లీకి బ్యాగులు మోసుకెళ్లే ఫార్ములా మాత్రమే తెలుసని, ఫార్ములా-ఈ రేసు గురించి తెలియదని ఎద్దేవా చేశారు. 11 నెలలుగా రోజుకో కుంభకోణం పేరుతో టైమ్‌పాస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీడియా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. భూసేకరణ పేరుతో రేవంత్‌రెడ్డి కుటుంబం చేస్తున్న దోపిడీని ప్రజల ముందు పెడతామని, పీడిత, గిరిజన రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.