- పోలీసులకు సవాల్‌గా మీర్‌పేట్ మర్డర్ కేసు
- నిందితుడితో సీన్ రీకన్ స్టక్షన్ చేయనున్న పోలీసులు
- కేసులో కీలకంగా మారనున్న సీసీ టీవీ ఫుటేజీ
మహేశ్వరం, జనవరి 23: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. పక్కా ప్లాన్‌తోనే భార్యను హతమార్చిన నిందితుడు కనీసం ఒక్క ఆధారం కూడా లేకుండా చేయడంతో కేసులో ఎలా ముందుకువెళ్లాలో అని తెలియక పోలీసులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.
అయితే ఈ కేసులో అపార్ట్‌మెంట్‌లోని సీసీ ఫుటేజీలో దృశ్యాలు కీలకం మారనున్నట్లు తెలుస్తోంది. అయితే నిం పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం. నిందితుడు నేరం ఒప్పుకున్నప్పటికీ మృతదేహాం లేకపోవడంతో కేసు క్లిష్టంగా మారింది. కనీసం ఒక్క ముక్కనైనా దొరికితే డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మాధవిని హత్య చేసినట్లు నేరం రుజువు చేసే అవకాశాలు ఉంటాయి.
పోలీసుల విచారణలో నిందితుడికి సంబంధించి మరో కోణం తెలిసినట్లు సమాచారం. గురుమూర్తి సెల్‌ఫోన్‌లో మరో మహిళకు సంబంధించి పర్సనల్ ఫోటోలను పోలీసులు గుర్తించారు. భార్య మాధవిని హత్య చేసిన సమయంలో గురుమూర్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
భయాందోళనలో అపార్ట్‌మెంట్ వాసులు...
గురుమూర్తి తనభార్యను కిరాతకంగా చంపినట్లు ఒప్పుకోవడంతో.. అతడు ఉండే అపార్ట్‌మెంట్‌లో పండుగకు గ్రామాల నుంచి తిరిగి వచ్చిన వారు షాక్‌కు గురయ్యారు. అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేసినట్లు తెలియడంతో భయంతో ఇండ్లకు తాళం వేసి తిరిగి స్వంత గ్రామాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హత్య జరిగిన అపార్ట్‌మెంట్ వైపు వెళ్లడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. కాగా నిందితుడు మాధవిని ఎలా హత్యచేశాడో తెలసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం.