తన వరకు వచ్చిన సినిమాలు కాక, తాను మెచ్చే పాత్రల్లోనే నటిస్తుందని నివేతా థామస్ గురించి చాలామంది అనుకుంటూంటారు. ఈ కారణం చేతనే ఆమె తెలుగు సినిమాల్లో అడపాదడపా కనబడుతుండటారనేది వారి వాదన. ఏదైమైనా కొంతకాలంగా తెలుగువారికి దూరమైన ఈ మలయాళీ భామ తాజాగా “చాలా ఎదురుచూశా.. అయితే దానికి తగ్గట్టే నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రంతో మీ ముందుకు వస్తున్నా” అంటూ కొత్త కబురు వినిపించింది. వివరాల్లోకెళితే.. నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో ‘35 చిన్న కథ కాదు’ పేరుతో ఓ సినిమా సిద్ధమవుతోంది.
నంద కిషోర్ ఈమాని రచన రూపొందుతున్న ఈ సినిమాని ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తుండగా, రానా సమర్ప కుడిగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ‘ఆకాశమే నీ హద్దురా’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలకు పనిచేసిన నిఖేత్ బొమ్మిరెడ్డి ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వివేక్ సాగర్ స్వరకల్పనలో రానున్న గీతాలకు కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి సాహిత్యం సమకూర్చనున్నారు. “పవిత్ర స్థలమైన తిరుపతి నేపథ్యంలో సాగనున్న ఈ కథ అందరి హృదయాలను హత్తుకుంటుంది” అని ఈ సినిమా గురించి చెప్పుకొచ్చింది నివేతా.