calender_icon.png 24 October, 2024 | 5:54 AM

ఫాంహౌస్ సీఎంను కాను.. పనిచేసే సీఎంను

18-09-2024 01:20:22 AM

రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్నిసార్లునా ఢిల్లీకి వెళ్తా 

హైడ్రాలో రాజకీయ కోణం లేదు.. ప్రజా కోణం ఉంది 

  1. ప్రజల ఆకాంక్షే మా కార్యాచరణ 
  2. గత పదేళ్లు నియంత పాలనలో తెలంగాణ
  3. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసమే విద్యా కమిషన్ 
  4. ప్రజా పాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

* ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ సిటీగా దిగజారి పోవడానికి గత పాలకులదే పాపం. ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినం. హైడ్రా వెనుక రాజకీయ కోణం, నా స్వార్థం ఏమీ లేదు. ఇదొక పవిత్ర కార్యం.

 సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లునా ఢిల్లీకి వెళ్తానని, కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేమీ ఫాంహౌస్ ముఖ్యమంత్రిని కాదని, పనిచేసే ముఖ్యమంత్రిని అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటే.. ఢిల్లీ పర్యటనలపై కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో తాను ఢిల్లీకి వెళ్లడం లేదని అన్నారు.

ఢిల్లీ.. పాకిస్తాన్‌లోనో, బంగ్లాదేశ్‌లోనో లేదనీ చురకలు అంటించారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలుంటాయని, రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వేల కోట్లు కడుతున్నప్పుడు.. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు అని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి అంటే వాళ్ల ఇంటి సంస్కృతి అని, తెలంగాణ అస్థిత్వం అంటే వారి కుటుంబ అస్థిత్వం అని గత పాలకులు భావించారని ఎద్దేవా చేశారు. నిజాంనే మట్టి కరిపించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయాన్ని వారు విస్మరించారని అన్నారు.

హైడ్రా ఏర్పాటులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, హైడ్రాతో హైదరాబాద్ భవిష్యత్‌కు భరోసా లభిస్తుందని స్పష్టంచేశారు. మంగళవారం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి జెండాను ఆవిష్కరించి, సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు నివాళి అర్పించారు. తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిశారు.  

రాచరిక పోకడపై తిరుగుబాటు సెప్టెంబర్ 17

సెప్టెంబర్ 17 ఒక చరిత్రాత్మక ఘట్టమని, ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు అని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రస్థానంలో సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన రోజు అని, దీని నిర్వహణ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయ న్నారు. కొందరు విలీన దినోత్సవమని, మరికొందరు విమోచన దినోత్సవమని సంబో ధిస్తున్నారని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలి పారు. లోతైన ఆలోచన తర్వాత ‘ప్రజాపాలన దినోత్సవం’గా జరుపుకోవడం సముచి తంగా ఉంటుందని భావించినట్టు పేర్కొన్నారు.  

ప్రజల ఆకాంక్ష.. మా కార్యాచరణ

ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ౪ కోట్ల ప్రజల ఆకాంక్ష, ఆలోచన అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంలో ఎటువంటి స్వార్థం లేదని ఉద్ఘాటించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుందని, అ పిడికిలి పోరాటానికి సింబల్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 17ను కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరాని విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అక్షరాల మార్పు కాదు.. ప్రజల ఆకాంక్షల తీర్పు 

తాము అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది పలికినట్టు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలపై గళమెత్తిన అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించామని వెల్లడించారు. తెలంగాణ సంక్షిప్త నామం ‘టీఎస్’ను ‘టీజీ’గా మార్చామని, ఇది కేవలం అక్షరాల మార్పు కాదని, ప్రజల ఆకాంక్షల తీర్పు అని స్పష్టంచేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబో తున్నామని తెలిపారు.  

మూసీ సుందరీకరణతో హైదరాబాద్ మార్పు 

పెట్టుబడుల ఆకర్షించేందుకు వ్యూహాత్మక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘ఫ్యూచర్ స్టేట్’గా బ్రాండ్ చేస్తున్నామని సీఎం చెప్పారు. మూసీ సుందరీకరణ ద్వారా హైదరాబాద్ రూపు రేఖలు మారుతుందనడంలో సందేహమే లేదన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదని, వేలాది మంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. యువత భవితకు పెనుసవాల్‌గా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. 

కాంగ్రెస్‌కు మంచి ట్రాక్ రికార్డు 

ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉందని, తమ రికార్డును తామే తిరగ రాస్తున్నామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించిన గత పాలకులు.. పదేళ్ల కాలంలో కేవలం రూ.లక్ష రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తాము ఏక కాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4.50లక్షల ఇళ్లు నిర్మించబోతున్నామని, ప్రతి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నట్టు తెలిపారు. స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెచ్చేందుకే తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

బానిస సంకెళ్లను తెంచడంలో సాయుధ పోరాటమే స్ఫూర్తి 

గడిచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ఆ బానిస సంకెళ్లను తెంచడానికి, తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో సాయుధ పోరాటమే తమకు స్ఫూర్తి అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితోనే తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు తెలిపారు. ప్రతి నిర్ణయంలోనూ ప్రజల కోణం, అమరుల ఆశయాలు, యువత ఆకాంక్షలు ఉండే దిశగా మా ప్రభుత్వంలో అడుగులు వేస్తున్నామని అన్నారు.  

హైడ్రా వెనుక రాజకీయం కోణం లేదు 

తెలంగాణ ఫ్యూచర్ స్టేట్‌గా మాత్రమే కాదు, క్లీన్ స్టేట్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. పర్యావరణ పునరుజ్జీవం కూడా జరగాల్సిన అవసరం ఉందని, అందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి గత పాలకులదే పాపమేనని, వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

హైడ్రా వెనుక రాజకీయ కోణం, నా స్వార్థం ఏమీ లేదని, ఇదోక పవిత్ర కార్యమని తెలిపారు. ప్రకృతిని కాపాడుకునే యజ్ఞానికి ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని స్పష్టం చేశారు. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుందన్నా నా భరోసాకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.