సియోల్, అక్టోబర్ 30: త్వరలో ఉత్తర కొరియా అణుపరీక్ష జరిపే అవకాశాలు ఉన్నాయని దక్షిణ కొరియా తెలిపింది. ఆ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న పుంగ్గేరి పట్టణంలోని టెస్టింగ్ గ్రౌండ్‌లో ఉన్న అణు పరీక్షను నిర్వహించడానికి కిమ్ సర్కారు పూర్తి సన్నాహాలు సిద్ధం చేసినట్లు సమాచారం అందిందని పేర్కొంది.
టన్నెల్ నంబర్ 3 వద్ద పేలుడు జరిగే అవకాశం ఉందని, అణు పరీక్షను నవంబర్‌లో ఎప్పుడైనా నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎంపీలకు సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అణు పరీక్ష వివరాలను అందజేసింది. మరోవైపు అమెరికాలోని లక్ష్యాలను తాకే లాంగ్ డిస్టెన్స్ క్షిపణిని పరీక్షించేందుకు కిమ్ సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
ఇటీవల సౌత్ కొరియాను అనుసంధానించే తమ దేశంలోని రోడ్స్, రైలు మార్గాలను కిమ్ సర్కారు పేల్చి వేసిన సంగతి తెలిసిందే. అంతేకాక సౌత్ కొరియాతో ఉన్న బార్డర్‌ను పూర్తిగా క్లోజ్ చేసింది. మే చివరి నుంచి దక్షిణ కొరియాలోకి ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను పంపడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలై ఇంకా కొనసాగుతున్నాయి.