calender_icon.png 25 September, 2024 | 9:48 AM

‘అట్రాసిటీ’ కేసుల్లో ఉత్తరాది టాప్!

25-09-2024 12:43:57 AM

  1. దేశవ్యాప్తంగా 51,656 అట్రాసిటీ కేసులు
  2. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ టాప్ త్రీ
  3. 13 రాష్ట్రాల్లోనే 97 శాతం కేసులు నమోదు
  4. తెలంగాణలో 3 శాతం, ఏపీలో 4 శాతం
  5. ఎన్‌సీఆర్‌బీ నివేదిక--------_2022లో వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): దళితులు, గిరిజనులపై జరిగే సామాజిక దాడులు, అణచివేత, అత్యాచారాలను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించారు. అయినా ఆ వర్గాలపై దాడులు ఆగడం లేదు. దేశంలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

దేశంలో నమోదవుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి 2022 సంవత్సరానికిగానూ వివరాలను నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు (ఎన్‌సీబీఆర్)వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా ఈ కేసులు ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే నమోదవ్వడం గమనార్హం. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచినట్టు నివేదిక స్పష్టంచేసింది.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు భారీగానే నమోదు అవుతున్నప్పటికీ కొన్ని కేసులు విచారణ పూర్తి కాకుండానే ముగిసిపోతున్నాయి. నేర నిరూపణకు సాక్ష్యాధారాలు తప్పనిసరి కావడమే దీనికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. వాస్తవానికి దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. 

13 రాష్ట్రాల్లోనే 97.1 శాతం కేసులు 

దేశవ్యాప్తంగా నమోదైన అట్రాసిటీ కేసుల్లో 97.1 శాతం కేవలం 13 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేసుల సంఖ్యలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా 51,656 అట్రాసిటీ కేసులు నమోదైతే, 12,286 కేసులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత 8,651 కేసులతో రెండో స్థానంలో రాజస్థాన్, 7,732 కేసులతో మూడో స్థానంలో మధ్యప్రదేశ్‌లు నిలిచాయి. అట్రాసిటీ కేసులు నమోదైన మిగిలిన రాష్ట్రాల్లో బీహార్ 6,799, ఒడిశా 3,576, మహారాష్ట్ర 2,706 కేసులతో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే జాబితాలోని మొదటి ఆరు రాష్ట్రాల్లోనే 81 శాతం కేసులు నమోదయ్యాయని స్పష్టమవుతుంది. 

తెలంగాణలో 3 శాతం.. ఏపీలో 4 శాతం 

అట్రాసిటీ కేసుల నమోదులో ఉత్తరాదిన ఉన్నంత తీవ్రత దక్షిణాదిన లేదు. నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 23.78 శాతం, రాజస్థాన్‌లో 16.75 శాతం, మధ్యప్రదేశ్‌లో 15 శాతం, బీహార్‌లో 13.16 శాతం, మహారాష్ట్రలో 5.24 శాతం, హర్యానాలో 3 శాతం, గుజరాత్‌లో 2 శాతంగా నమోదు అయ్యాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో అట్రాసిటీ కేసులను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా 4 శాతం చొప్పున నమోదు కాగా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 3 శాతం చొప్పున కేసులు నమోదు అయ్యాయి. కేరళలో కేవలం 2 శాతమే కేసులు నమోదు కావడం గమనార్హం.

గిరిజన దాడులు 

గిరిజన జరిగిన దాడులకు సంబంధించి నమోదైన అట్రాసిటీ కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గిరిజన బాధితులు పెట్టిన కేసుల సంఖ్య 9,735 కాగా, మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 2,979 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత 2,498 కేసులతో రాజస్థాన్ రెండో స్థానంలో, 773 కేసులతో ఒడిశా మూడో స్థానంలో నిలిచింది. 691 కేసులతో నాలుగో స్థానంలో మహారాష్ట్ర, 499 కేసులతో ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. 

తప్పుడు కేసులూ ఎక్కువే

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినప్పుడు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెడితేనే నిందితులకు శిక్ష పడుతుంది. కానీ, ఈ విషయంలో చాలా కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలవుతున్నప్పటికీ వాటిలో చాలావరకు ఆధారాలు లేని కారణంగా కేసుల విచారణ ముగుస్తుంది. కొన్నింటిని తప్పుడు ఫిర్యాదులుగా పేర్కొంటూ ముగించినట్టు గణాంకాలు చెప్తున్నాయి.

ఎస్సీ సంబంధిత కేసుల్లో 60.38 శాతం కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు కాగా, అందులో 14.78 శాతం కేసులు తప్పుడు ఫిర్యాదులు/సరైన ఆధారాలు లేకపోవడం వంటి కారణాలతో విచారణ ముగిసింది. 2022 నాటికి ఎస్సీ అట్రాసిటీకి సంబంధించి 17,166 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్టు నివేదికలో పేర్కొంది.

ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి 63.32 శాతం కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు కాగా, అందులో 14.71 శాతం కేసులు ఆయా కారణాలతో విచారణ ముగిశాయి. ఎస్టీలపై అట్రాసిటీలకు సంబంధించి 2,702 కేసుల్లో ఇంకా విచారణ కొనసాగుతోంది. కేసులు, విచారణ ప్రక్రియ ఎలా ఉన్నప్పటికీ నేర నిరూపణ రేటు మాత్రం తగ్గుతోంది.

2020లో 39.2 శాతం నేరాల నిరూపణ కాగా, 2022కు 32.4 శాతానికి పడిపోయింది. దీంతోపాటు ప్రత్యేక చట్టం ప్రకారం కేసుల విచారణ కొనసాగించేందుకు ప్రత్యేక కోర్టులు తక్కువగా ఉన్నాయని నివేదికలో స్పష్టం చేసింది. 

రాష్ట్రాల వారీగా 

అట్రాసిటీ కేసుల శాతం 

రాష్ట్రం కేసుల శాతం

ఉత్తర్‌ప్రదేశ్ 23.78

రాజస్థాన్ 16.75

మధ్యప్రదేశ్ 15

బీహార్ 13.16

మహారాష్ట్ర 5.24

ఆంధ్రప్రదేశ్ 4

కర్ణాటక 4

తెలంగాణ 3

తమిళనాడు 3

హర్యానా 3

గుజరాత్ 2

కేరళ 2