calender_icon.png 29 November, 2024 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడుల ఆకర్షణలో ఉత్తరాది జోరు

30-10-2024 01:54:18 AM

  1. జాబితాలోని టాప్‌టెన్‌లో 7 ఉత్తరాది రాష్ట్రాలే..
  2. పెట్టుబడుల రాకలో దక్షిణాది వెనుకబాటు
  3. మొదటి రెండు త్రైమాసికాల్లో మహారాష్ట్రనే టాప్
  4. క్యూ1లో 9వ స్థానం, క్యూ2లో 8వ స్థానంలో తెలంగాణ
  5. ఆరు నెలల్లో రాష్ట్రానికి రూ.56,515 కోట్లు పెట్టుబడులు
  6. దేశవ్యాప్త పెట్టుబడుల్లో 7.37%

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కొన్ని అంశాల్లో వెనుకబడుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా ఒరిగేదేం ఉండట్లేదు. ఈ అంశం ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపుల్లో స్పష్టమైంది.

అయితే నిధుల కేటాయింపుల్లోనే కాదు పెట్టుబడుల ఆకర్షణలోనూ దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాలకు సంబంధించిన ఆయా రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులపై ఇండియన్ టెక్ గైడ్ సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా పెట్టుబడుల ఆకర్షణలో ఆయా రాష్ట్రాల పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది.

2024 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసి కాల్లోనూ టాప్‌టెన్ జాబితాలో 7 ఉత్తరాది రాష్ట్రాలుండగా, కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే దక్షిణాది రాష్ట్రాలున్నాయి. అందులో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. 

దక్షిణాది వెనుకబాటు..

దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికంలో మొత్తం 2,443 ప్రాజెక్టులకుగానూ రూ.6,46,293 కోట్ల పెట్టుబడులు రాగా అందులో దక్షిణాదికి చెందిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలన్నింటికీ కలిపి 87,031.59 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిగిలిన 5,59,262.24 కోట్ల పెట్టుబడులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి.

దేశవ్యాప్త పెట్టుబడుల్లో క్యూ 1కు సంబంధించి కేవలం 13.46 శాతం మాత్రమే దక్షిణాదికి రాగా, మిగిలిన 86.54 శాతం పెట్టుబడులను ఉత్తరాది రాష్ట్రాలే ఆకర్షించాయి. ఇదిలా ఉండగా రెండో త్రైమాసికాన్ని పరిశీలిస్తే దేశవాప్తంగా మొత్తం 2,684 ప్రాజెక్టులకుగానూ రూ. 9,21,081.08 కోట్ల పెట్టుబడులు రాగా వాటిలో రూ.1,74,155.27 కోట్లు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చాయి.

మిగిలిన 7,46,925.81 కోట్ల పెట్టుబడులు ఉత్తరాది రాష్ట్రాలు సొంతం చేసుకుని ముందంజలో ఉన్నాయి. దీంతోపాటు క్యూ 2లో దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాలకు కలిపి వచ్చిన పెట్టుబడులు 18.91 శాతంగా నివేదికలో వెల్లడైంది. 

తెలంగాణకు 7.37 శాతమే...

పెట్టుబడులను ఆకర్షించడంలో జాబితాలోని టాప్‌టెన్‌లో తెలంగాణ స్థానం పొందినప్పటికీ అది చెప్పుకోదగ్గ స్థానంలో లేదు. మొదటి త్రైమాసికంలో జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్న తెలంగాణ రెండో త్రైమాసికం వరకు మెరుగుదల కనబర్చి ఎనిమిదవ స్థానానికి చేరుకుంది. క్యూ 1లో తెలంగాణ రాష్ట్రం రూ. 26,762.78 పెట్టుబడులను ఆకర్షించగలిగింది.

ఈ పెట్టుబడులు దేశవ్యాప్తంగా వచ్చిన వాటిలో కేవలం 4.14 శాతం మాత్రమే. అదేవిధంగా క్యూ 2లో రూ. 29,753.19 కోట్ల పెట్టుబడులను సాధించింది. ఇది దేశవ్యాప్త పెట్టుబడుల్లో 3.23 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంగా రూ. 56,515 కోట్లతో 7.37 శాతం పెట్టుబడులను ఆకర్షించి టాప్‌టెన్ జాబితాలో నిలిచింది.

మహారాష్ట్ర నంబర్‌వన్

రెండు త్రైమాసికాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే క్యూ 1 కంటే క్యూ 2లో దక్షిణాది రాష్ట్రాలు కొంత మెరుగుదల చూపించాయి. కానీ మొత్తం ఆరు నెలలకు గానూ జాబితాలో మహారాష్ట్ర రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర క్యూ 1లో రూ.1,35,055.07 కోట్లు, క్యూ2 లో రూ. 2,80,856.02 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.

మొదటి త్రైమాసికంలో 20.90 శాతం, రెండో త్రైమాసికంలో 30.49 శాతం పెట్టుబడులను సాధించినట్టు నివేదిక వెల్లడించింది. మహారాష్ట్రతోపాటు ఉత్తరాది నుంచి ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, ఒరిస్సా, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు టాప్‌టెన్ జాబితాలో ఉన్నాయి.