calender_icon.png 3 April, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలాస నౌకలో నోరో వైరస్

03-04-2025 12:07:34 AM

200 మందికిపైగా ప్రయాణికులకు అస్వస్థత

న్యూఢిల్లీ: క్వీన్ మేరీ 2 లగ్జరీ విలాస నౌకలో నోరో వైరస్ కారణంగా 200 మందికి పైగా ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించినట్టు  కథనాలు వెలువడ్డాయి. క్వీన్ మేరీ 2 కునార్ట్ లైన్స్ అనే క్రూయిజ్ నౌక ఈ ఏడాది మార్చి 8న సౌతాంప్టన్ నుంచి తూర్పు కరేబియన్‌కు బయలుదేరింది. ఈ నౌకలో మొత్తం 2,538 మంది ప్రయాణికులు, 1,232 మంది సిబ్బంది ఉన్నారు.

వారిలో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బందికి ఈ నోరోవైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఒక ట్రాకింగ్ సైట్ ప్రకారం.. మార్చి 18న ఆ నౌక న్యూయార్క్‌లో ఆగింది. ఆ టైమ్‌లోనే ఈ వైరస్ వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు. నోరో వైరస్‌ను వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. ఈ వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణముంది. అన్ని వయసుల వారికి ఇది వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. ఈ వ్యాధి బారినపడిన వారిలో విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.