14-04-2025 05:19:10 PM
కేసముద్రం మార్కెట్ బయట ఆగని కొనుగోళ్ళు
మహబూబాబాద్ (విజయక్రాంతి): అధిక ధర ఆశ చూపి రైతులను తమ వద్ద వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేలా రప్పించి.. తర్వాత చార్జీల పేరుతో కోతలు పెడుతూ రైతులకు కుచ్చుటోపి పెడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో వ్యాపారులు కొందరు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా మార్కెట్ బయట వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు తెర లేపారు. మార్కెట్లో వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కిందటి రోజు లభించిన ధరలకు క్వింటాలుకు 100 నుండి 200 రూపాయలు అధికంగా చెల్లిస్తామని మార్కెట్ కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చే వాహనాలను మార్గమధ్యలోనే అడ్డుకొని తమ ట్రేడింగ్ కంపెనీలు, మిల్లులకు తీసుకెళ్తున్నారు. అధిక ధర ఆశతో వారికి సరుకులను విక్రయించడానికి మొగ్గు చూపిందే తడువు వెంటనే సదరు వాహనాన్ని వే బ్రిడ్జి కాంటా పై తూకం వేయించి తీసుకురావాలని చెబుతున్నారు. వే బ్రిడ్జి తూకం చార్జీ 50 రూపాయలు రైతే చెల్లించి తూకం వేయించి సదరు వ్యాపారికి చెందిన మిల్లు, ట్రేడింగ్ కంపెనీ వద్దకు వాహనాన్ని తీసుకు వెళ్ళగానే అక్కడ నేరుగా లిఫ్ట్ చేయిస్తున్నారు.
వే బ్రిడ్జి లో నిర్దేశించిన వే మెంట్ ప్రకారం ప్రకారం ముందుగా నిర్ణయించిన ధరతో లెక్క చూసి రైతుకు డబ్బులు చెల్లించకుండా 30 కిలోలు తరుగు కింద మినహాయించుకుని, ఆ తరువాత బస్తాలకు లెక్క గట్టి ఒక్కో బస్తాకు దడువాయి, హమాలీ, కూలీ పేరుతో 16 నుంచి 25 రూపాయల వరకు చార్జీల పేరుతో కోత పెట్టి డబ్బులు చెల్లిస్తున్నారు. ఎక్కడ కూడా కార్మికుల ప్రమేయం లేకుండానే రైతే నేరుగా తాను పండించిన పంటను ట్రాక్టర్ లేదంటే ఇతర వాహనాల్లో తీసుకువచ్చి వే బ్రిడ్జి కాంట వేయించి ట్రేడర్ వద్దకు తీసుకువచ్చి దిగుమతి చేస్తుండగా చార్జీల పేరుతో మినహాయింపులు చేసుకోవడం విశేషం. దీనికి తోడు నగదు చెల్లింపులు చేస్తున్నామని విక్రయించిన వ్యవసాయ ఉత్పత్తుల విలువలో ఒక శాతం నగదు మినహాయించుకుంటున్నారు. అటు చేయని పనికి చార్జీలు, తరుగు పేరుతో 30 కిలోలు, నగదు చెల్లింపు పేరుతో ఒక శాతం కోత పెడుతుండడంతో ముందు చెప్పిన అధిక ధర.. అన్నదాతకు.. అల్లికి అల్లి.. సున్నకు సున్న.. అన్న చందంగా మారుతోంది.
డ్రైవర్లకు మామూళ్ళు..
గ్రామాల నుండి కేసముద్రం మార్కెట్ కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చే వాహనాల డ్రైవర్లకు కొందరు ట్రేడర్లు మామూళ్ళు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా తమ వద్దకే వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువచ్చి రైతుకు నచ్చజెప్పి తమకు విక్రయించేలా సహకరించిన డ్రైవర్లకు 150 నుండి 200 రూపాయలు చెల్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మామూళ్లకు ఆశపడ్డ డ్రైవర్లు కొందరు నేరుగా సదరు ట్రేడింగ్ కంపెనీ వద్దకే వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళ్లి ఇక్కడైతే మంచి ధర లభిస్తుంది వెంటనే డబ్బులు ఇస్తారని రైతులకు నచ్చజెప్పి సరుకులను డంపు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
పెరుగుతున్న ‘రాస్తామాల్’, తగ్గుతున్న ‘గంజ్’ఆదాయం
గత రెండు సంవత్సరాలుగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గిస్తున్న వ్యాపారులు, నేరుగా కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు ‘రాస్తామాల్’ పేరుతో మార్కెట్ కు చెల్లించాల్సిన పన్ను చెల్లింపులు చేస్తున్నారు. 2023 - 24 సంవత్సరంలో ‘రాస్తా మాల్’ ద్వారా మార్కెట్ ఆదాయం 95 లక్షల రూపాయలు రాగా, 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో కోటి 17 లక్షలకు పెరగడం, అదే సమయంలో కేసముద్రం మార్కెట్ ‘గంజ్’ ఆదాయం గత ఏడాది రెండు కోట్ల 88 లక్షలు రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల 42 లక్షలకు పడిపోవడం మార్కెట్ బయట పెరిగిన కొనుగోళ్ల తీరుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
ప్రచారం మినహా చర్యలు లేవు
మార్కెట్ బయట వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా నిలువరించాల్సిన మార్కెట్ కమిటీ, అధికారులు ఇటీవల దిద్దుబాటు చర్యలు చేపట్టామని ప్రకటించినప్పటికీ కేవలం కంటి తుడుపుగా ఆటోల ద్వారా గ్రామాల్లో మార్కెట్లోనే సరుకులు విక్రయించాలని ప్రచారం చేయడం మినహా మార్కెట్ బయట కొనుగోలు నిలువరించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం ఈ - నామ్ పరిధిలో కొనసాగడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతీయస్థాయిలో విశిష్ట సేవలకు ‘బెస్ట్ ఎక్సలెన్సీ’ అవార్డు అందుకున్నది. అటువంటి మార్కెట్ లో రోజురోజుకు సరుకుల రాబడి తగ్గిపోయి మార్కెట్ ప్రతిష్ట, ప్రభావం కోల్పోయే పరిస్థితికి చేరువవుతోందనే విమర్శలు వస్తున్నాయి.
కార్మికుల ఉపాధికి గండి
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పై 600కు పైగా ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పైగా పరోక్షంగా కార్మికులకు జీవనోపాధి లభిస్తోంది. అలాగే మార్కెట్ వల్ల కేసముద్రం పట్టణానికి ఒక గుర్తింపు ఉంది. అనేక వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మార్కెట్ పై ఆధారపడి నిర్వహిస్తున్నారు. మార్కెట్ బయట కొనుగోళ్లతో కార్మికులకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో పాటు ఇతర వ్యాపారుల పై పెను ప్రభావం చూపుతోంది.
ప్రభుత్వం స్పందించాలి
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మనుగడ కోసం ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక, కర్షక, వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. రెగ్యులేటెడ్ మార్కెట్ గా గుర్తింపు పొందడంతో పాటు ఈ నామ్ విధానం అమలు చేస్తూ రైతుల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించిన వెంటనే పారదర్శకంగా, నిర్దేశిత చార్జీలను మినహాయించి, చట్టబద్ధంగా చెల్లింపులు చేస్తున్న మార్కెట్ బయట కొనుగోళ్ళు నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కేసముద్రం మార్కెట్ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.