calender_icon.png 22 September, 2024 | 3:07 AM

ఆగని బియ్యం దందా

28-07-2024 12:29:46 AM

  1. యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా 
  2. సొమ్ము చేసుకుంటున్న దళారులు

రంగారెడ్డి, జూలై 27 (విజయక్రాంతి): నిరుపేదలు ఆకలితో ఆలమటించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీ కింద పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ప్రతి నెల కోట్ల రూపాయలు వెచ్చిం చి ప్రభుత్వం అర్హులకు పథకం అమలు చేస్తుంటే అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లోపం కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రతి నెల ఆహార భద్రత కార్డుదారులకు కోటా ప్రకారం కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు ఒకరికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు ఒకరికి 35 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు.

కాగా, ఎక్కువ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని వినియోగించకపోవడంతో దళారులకు వరంగా మారింది. దీంతో కొందరు దళారులు లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ  కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. బియ్యం దందాలో ప్రధానంగా మిల్లు యాజమాన్యాలే ముఖ్యపాత్ర పోషిస్తూ తెరవెనుక తథంగాన్ని నడిపిస్తున్నారు. వ్యాపారులకు అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకుల అండా ఉండడంతో వారి దందాకు చెక్ పడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.  

ఆదాయం బాగుండడంతో..

రేషన్ బియ్యం దందాలో సులభంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉండడంతో స్థానిక కిరాణ దుకాణాలను నిర్వహించే వారితో పాటు గ్రామాల్లో యువత సైతం వ్యాపారంపై దృష్టి సారించారు. ప్రత్యేకంగా వాహనాలను కొనుగోలు చేసి ఈ దందాకు వినియోగిస్తున్నారు. నేరుగా లబ్ధిదారులను ఆశ్రయిస్తూ కిలో రూ.10 నుంచి రూ.15 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని రాత్రివేళల్లో గుట్టుగా తరలిస్తూ మిల్లుల యజమానులకు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు కొంత మార్జిన్ తీసుకొని విక్రయిస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. జిల్లాలో అనేక మండలాల్లో  ఈ దందా జోరు గా సాగుతోంది. మరికొందరు పీడీఎస్ బియ్యాన్నే రైస్‌మిల్లుల్లో రీసైకిల్ చేసి తిరిగి ప్రభుత్వానికే సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పట్టుబడేది చిరువ్యాపారులే.. 

పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. అడపాదడపా వారు సమాచారం అందుకొని దాడులు చేస్తున్న గ్రామాల్లో దందా సాగించే దళారులు, చిరువ్యాపారులు మాత్రమే పట్టుబడడం విశేషం. పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు సాగించేవారు మాత్రం దొరకకపోవడం విడ్డూరం. జిల్లాలో ఈ దందా జోరుగా సాగుతోంది. ఇటీవలనే షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, శంషాబాద్, చేవెళ్లలో రేషన్ బియ్యం దందాకు పాల్పడుతున్న వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేశారు. అదేవిధంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన మిల్లులను కూడా సీజ్ చేశారు. మరికొందరిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు. అయినా కూడా దందా సాగుతుండడం విశేషం. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా లబ్ధిదారులకు సబ్సిడీ కింద కేటాయిస్తున్న నిధులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలా లేక చౌక ధర దుకాణాలకు నేరుగా సన్న బియ్యం పంపిణీ చేయాలా అనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

కఠిన చర్యలు తీసుకుంటాం.. 

రేషన్ దందా చేస్తూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదే పదే పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతాం. రేషన్ బియ్యం దందాను అరికట్టడంలో ప్రజలు కూడా తమ బాధ్యత నిర్వర్తించాలి. ప్రభుత్వం కోట్లాది రూపాయాలను వెచ్చించి బియ్యం పంపిణీ చేస్తుంటే, వాటిని వినియోగించకుండా అమ్ముకోవడం నేరం.  

 రఘునందన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ, రంగారెడ్డి జిల్లా