- అనుమతి లేకుండా స్పా, మసాజ్, సెలూన్ల ఏర్పాటు
- కన్నెత్తి చూడని పోలీసులు, తూతూమంత్రంగా చర్యలు
ఎల్బీనగర్, డిసెంబర్ 26: ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా స్పా, మసాజ్, బ్యూటీసెలూన్ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో అసాంఘిక కార్యకలపాలు కొనసాగుతున్నాయి. పోలీసులకు సమాచారం అందినా తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీందో వారి చర్యలకు అడ్డు లేకుండా పోతుంది. స్పా, మసాజ్ కేంద్రాల ఏర్పాటుకు హైకోర్టు నుంచి పర్మినెంట్ లైసెన్స్ పర్మిషన్ తెచ్చుకోవాలి. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ నుంచి ట్రెడ్ లైసెన్స్ తీసుకోవాలి, లేబర్, ట్రేడ్ లెసెన్స్‌లను ఏటా రెన్యువల్ చేసుకోవాలి. చాలా సెంటర్లు అనుమతి తీసుకుంటున్నాయే గానీ, ట్రెడ్, లేబర్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవడం లేదు. ఆయా కేంద్రాల్లో పని చేసేవారు కూడా సరైన విద్యార్హతలు ఉండాలి.
థెరఫిస్టులు కచ్చితంగా సంబంధిత రంగంలో సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ చాలా కేంద్రాల్లో అర్హతలు లేనివారిని నియమిస్తున్నారు. గతంలో సుమారు 5 నుంచి 10 వరకు స్పా, మసాజ్ సెంటర్లు ఉండేవి. కానీ, నేడు కాలనీకోటి అన్నట్లు వెలిసాయి. స్పా, మసాజ్, సెలూన్ సెంటర్లపై పోలీసుల నిఘా కొరవడింది. తనిఖీలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ఇటీవల పోలీసులు పలుచోట్ల దాడులు చేపట్టినా.. మళ్లీ ఆయా కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్‌లోని ప్రధాన రోడ్లలో స్పా, మసాజ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల నిర్వాహకులు బోర్డు పెట్టకుండా బయటికి కనిపించకుండా అపార్ట్‌మెంట్లలో తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇటీవల న్యూనాగోల్ రోడ్డులో ఉన్న స్పా కేంద్రంపై పోలీసులు దాడి చేసి, యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయినా.. స్పా కేంద్రంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.