calender_icon.png 15 January, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌బోర్డులో ముస్లిమేతరులు!

08-08-2024 12:17:48 AM

మహిళలకూ భాగస్వామ్యం

సవరణ బిల్లులో కేంద్రం ప్రతిపాదన?

న్యూఢిల్లీ, ఆగస్టు 7: వక్ఫ్‌బోర్డులో సమూ ల మార్పులకు కేంద్రప్రభుత్వం సమాయత్తమైంది. 1995 నాటి వక్ఫ్ చట్టంలో ఏకంగా 44 సెక్షన్లకు సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును మోదీ సర్కారు రూపొందించినట్టు సమాచారం. ఇందులో పలు సంచలన విషయాలు చేర్చినట్టు చెప్తున్నారు. ఈ బిల్లును త్వరలోనే పార్లమెంటు ముందు ఉంచనున్నారు. బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్‌బోర్డు రూపురేఖలే మారిపోతాయని చెప్తున్నారు. ఈ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు 1923 నాటి వక్ఫ్ చట్టాన్ని రద్దుచేసే బిల్లును కూడా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. 

అందరికీ చోటు

వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయిలో బోర్డుల్లో ప్రస్తుతం పురుషులకు మాత్రమే చోటు ఉన్నది. మహిళలకుగానీ, ముస్లిమేతరులకుగానీ అవకాశం లేదు. ఈ బిల్లుతో బోర్డుల్లో ముస్లిమేతరులకు, ముస్లిం మహిళలకు కూడా సభ్యులుగా చోటు కల్పిం చే అవకాశం ఉంటుందని సమాచారం. వక్ఫ్ యాక్ట్ ఇకపై యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియంట్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ అని పిలుస్తారు. 

అధికారాలకు కత్తెర

ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం మత అవసరాలకు, స్వచ్ఛంద కార్యక్రమాల కోసం దాతలు ఇచ్చిన భూమిని ప్రత్యేకంగా నిర్వహించే సంస్థనే వక్ఫ్‌బోర్డు అంటారు. ఈ బోర్డు తన పరిధిలోకి వచ్చిన ఏ భూమినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారం ఉన్నది. ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 40 బోర్డుకు ఈ అధికారం కల్పిస్తున్నది. కొత్త బిల్లు ద్వారా ఈ సెక్షన్ 40ని రద్దుచేయనున్నారు. అంటే ఇకపై వక్ఫ్‌బోర్డు తనకు తానుగా ఏ భూమినీ వక్ఫ్ ఆస్తిగా ప్రకటించటానికి వీలు ఉండదు. ఈ అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టనున్నారు. 

ఇదీ స్వరూపం

కొత్త బిల్లు ప్రకారం జాతీయ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్రాల వక్ఫ్‌బోర్డుల స్వరూపాన్ని కేంద్రం ఖరారు చేసింది. జాతీయ వక్ఫ్ కౌన్సిల్‌తోపాటు రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో కనీసం ఇద్దరు మహిళలకు చోటు ఉండాలి. కౌన్సిల్‌లో ఒక కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలు, ముస్లిం సంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు, ముగ్గు రు ముస్లిం పర్సనల్ లా నిపుణులు ఉంటారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులకు చెందిన ముగ్గ రు మాజీ జడ్జీలు, జాతీయస్థాయి ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు నలుగురికి కూడా ఇందులో చోటు ఉంటుంది. వీరిలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. ఏదైనా ఆస్థిని వక్ఫ్ ఆస్తిని రిజిస్టర్ చేయటానికి ముందుగా కౌన్సిల్‌కు చెందిన వెబ్‌సైట్‌లో వాటి వివరాలు నమోదుచేసి, ఆ తర్వాత అభ్యంతరాలు లేకుంటే రిజిస్టర్ చే యాల్సి ఉంటుంది. వక్ఫ్ ఆస్తులను సర్వే చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ లేదా డిఫ్యూటీ కలెక్టర్‌కు కట్టబెట్టనున్నారు. బోర్డు నిర్ణయాలను 90 రోజులలోపు హైకోర్టులో సవాల్ చేసేలా కొత్త నిబంధనను చేర్చనున్నారు. 

తీవ్ర వ్యతిరేకత

కేంద్రం ప్రతిపాదించిన సవరణలను విపక్ష పార్టీలతోపాటు ముస్లిం సంఘాలు, వక్ఫ్‌బోర్డులు ఖండిస్తునాయి. వక్ఫ్ బోర్డులను బలహీనపర్చేందుకే బీజేపీ సర్కారు మార్పు లు చేస్తోందని తమిళనాడు వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు ఆరోపించారు. ఎలాంటి మార్పులను అంగీకరించబోమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇప్పటికే ప్రకటించింది.