05-04-2025 01:11:07 AM
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. బీజేపీ తరపున గౌతంరావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరితో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశారు.
ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. కాంగ్రెస్ మద్దతుతో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఎంఐఎం భావించగా, బీజేపీ తరఫున కూడా నామినేషన్ దాఖలు కావడం ఎంఐఎంకు షాక్‌నిచ్చింది. ఎన్నికల్లో పోటీకి అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ దూరంగా ఉన్నాయి. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్యే ప్రధాన పోరు అని తేలిపోయింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బలమైన పోటీ ఇచ్చేందుకు బీజేపీకి తగినంత బలం లేకపోయినా బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. ఈ నెల 23న ఎన్నికకు పోలింగ్ జరుగనున్నది. ఇదే నెల 25న కౌంటింగ్ పూర్తయి, ఇదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.