calender_icon.png 11 October, 2024 | 10:55 AM

నామినేటెడ్ పోస్టుల భర్తీ షురూ

11-10-2024 12:12:07 AM

సిద్ధిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా లింగమూర్తి నియామకం

ఇతర పోస్టులకు జిల్లాలో ప్రయత్నాలను ముమ్మరం చేసిన ఆశావహులు

సిద్దిపేట, అక్టోబర్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు 10 నెలలు పూర్తి కావొస్తున్నా నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న నేతలకు శుభవార్త అందింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించినట్లుగానే నామినేటెడ్ పదవుల భర్తీకి వేగంగా అడు గులు ముందుకు పడుతున్నాయి.

స్వరాష్ట్రంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవు ల కోసం తీవ్రమైన పోటీ ఉండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఏళ్లతరబడి పార్టీలో కొనసాగుతున్న నాయకులు పదవుల కోసం పట్టుబడు తున్నారు. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌ను సిద్దిపేటలో చేర్చారు.

బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి హుస్నాబాద్ నేతకు దక్కింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దసరా కానుకగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌గా హుస్నాబాద్‌లో పార్టీ సినీయర్ నాయకుడు కెడం లింగమూర్తిని నియమిస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బూర వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల కోసం జిల్లా నుంచి ప్రయత్నాలు చేసినవారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఒక్కపదవి కూడా దక్కలేదు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నవారికి అధిష్టానం దసరా కానుక ఇవ్వనున్నట్లు సమాచారం.

జిల్లాలో అత్యంధికంగా సిద్దిపేట అర్బన డెవలప్‌మెంట్ అథారిటీ (సుడ) పదవికి 10 మం దికిపైగా పోటీపడుతున్నారు. అలాగే జిల్లాలోని నియోజకవర్గాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం కూడా పోటి అధికంగానే ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సమాచారం.

అలాగే జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి కొండా సురేఖ.. నాయకులతో నామినేటెడ్ పదవుల విషయంలో అంటీ ముట్టనట్టుగా ఉండటంతో ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు.

దసరా వేడుకలు ముగిసిన వెంటనే జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు చేర్యాల, గజ్వేల్ మార్కెట్ కమిటీలకు మాత్రమే నియామకాలు జరిగాయి. త్వరలో అన్ని నామినేటెట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఆశవహలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.