calender_icon.png 1 October, 2024 | 10:22 AM

పార్కింగ్‌కు నామమాత్రపు చార్జీలు

01-10-2024 01:36:47 AM

ప్రయాణికులకు మెట్రో షాక్

నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద 6వ తేదీ నుంచి అమలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మెట్రో ప్రయాణికులకు ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ మరోసారి షాక్ ఇచ్చింది. 6వ తేదీ నుంచి బ్లూ కారిడార్‌లోని నాగోల్, రెడ్ కారిడార్‌లోని మియా పూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయబోతున్న ట్లు సోమవారం ప్రకటింస్తూనే, మరోవైపు బైక్‌లు, కార్లకు ప్రత్యేక పార్కింగ్, 24 గంటల సీసీ కెమెరా పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

  ప్రయాణికుల కోసం బయో టాయిలెట్లు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలా లు కేటాయిస్తామని పేర్కొన్నది.

ఆందోళనల నేపథ్యంలో వెనక్కి..

ఆగస్టు 14 నుంచే ఛార్జీలు వసూలు చేస్తామని ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ప్రకటిం చగానే ప్రయాణికులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేశాయి. దీంతో సంస్థ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నది. తర్వాత కొద్దిరోజులకు సెప్టెంబర్ 15 నుంచి ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు మళ్లీ ప్రకటన జారీ చేసింది. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు.

ఈ మేరకు నాగోల్, మియాపూర్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. తాజాగా పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్నట్లు ప్రకటించి సందేహాలన్నింటినీ నివృత్తి చేసింది. ఈ రెండు మెట్రో స్టేష న్ల వద్ద ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వాహనాలు పార్క్ చేస్తారు. నామ మాత్రపు ఛార్జీల పేరిట అనేది నామమాత్రమేనని, నిర్వాహకులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారని ప్రయాణికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆఫర్ కార్డుల గడువు పొడిగింపు 

ప్రయాణికులకు ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ అధికారులు ఓ గుడ్‌న్యూస్ కూడా చెప్పారు. ఆఫర్ కార్డుల గడువును 2025 మార్చి 31 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారంతో ఆఫర్ కార్డుల గడువు ముగియనున్న నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

సూపర్ సేవర్ ఆఫర్ - 59

కార్డుతో తీసుకున్న వారు సెలవు రోజుల్లో కేవలం రూ.59తో ప్రయాణికు లు అపరిమితంగా సిటీలో ప్రయాణించే వెసులుబాటు ఉన్నది. 

స్టూడెంట్ పాస్ ఆఫర్ : 

కార్డుతో విద్యార్థులు 20 ట్రిప్పులకు ఛార్జీలు చెల్లించి అదనంగా మరో 10 ట్రిప్పులు ప్రయాణించవచ్చు. 

సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: 

రద్దీ లేని సమయాల్లో కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్ (సీఎస్‌సీ) ద్వారా టిక్కెట్ ధర పై 10 శాతం తగ్గింపు పొందవచ్చు.